దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు
భువనగిరి : దివ్యాంగులకు వైకల్య శాతాన్ని అనుసరించి ఇప్పటి వరకు జారీచేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. దేశ వ్యాప్తంగా ఓకే విధమైన గుర్తింపు కార్డు అమల్లోకి తీసుకురానుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో యూడీఐడీ (యూనిఫై డిసెబుల్ ఐడెంటిటీ) కార్డు అందుబాటులో ఉండగా తెలంగాణలో మాత్రం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల్లో చెల్లుబాటు కాకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 1నుంచి మన రాష్ట్రంలో కూడా యూడీఐడీ కార్డులు విధానం అమల్లోకి రానుంది. రానున్న రోజుల్లో యూడీఐడీ కార్డు ఉంటేనే దివ్యాంగులకు పింఛన్లు, సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న దివ్యాంగులు తప్పనిసరిగా యూడీఐడీ కార్డు వివరాలను తమ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నిర్ధారిత రంగుల్లో కార్డులు
వైకల్య శాతం ఆధారంగా నిర్ధారిత రంగుల్లో యూడీఐడీ కార్డులను జారీ చేయనున్నారు. కార్డు ఒక్కసారి ఇస్తే మళ్లీ పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉండదు. బస్సులు, రైళ్లల్లో రాయితీతో పాటు దివ్యాంగులకు వర్తించే అన్ని సౌకర్యాలు యూడీఐడీ కార్డు ద్వారా పొందవచ్చు.
12,940 మంది దివ్యాంగులు
జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్న దివ్యాంగులు 12,940 మంది ఉన్నారు. భవిష్యత్‌లో వీరందరూ వన్ నేషన్ వన్ డిసెబిలిటీ కింద యూడీఐడీ కార్డులు పొందాల్సి ఉంటుంది.
పాత పద్ధతిలోనే స్లాట్ బుకింగ్
యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు హాజరు కావాల్సి ఉంటుంది. ముందుగా మీ సేవ కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతరం నిర్దేశిత తేదీన సదరం క్యాంపునకు వెళ్లాలి. అక్కడ వైద్య పరీక్షల అనంతరం దరఖాస్తుదారుడి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దివ్యాంగుడి వివరాలు, వైకల్య శాతం వైద్యుల లాగిన్‌కు చేరుతుంది. వివరాలను పరిశీలించి అప్‌లోడ్ చేయగానే కార్డు మంజూరు అవుతుంది. జారీ చేసిన వ్యక్తి డిజిటల్ సంతకంతో కార్డు ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేస్తోంది.
ఫ సదరం ధ్రువీకరణ పత్రాలకు స్వస్తి
ఫ దేశ వ్యాప్తంగా ఒకే కార్డు విధానం
ఫ దాని ప్రకారంగానే పింఛన్, సంక్షేమ పథకాల వర్తింపు
ఫ మార్చి 1 తేదీ నుంచి అమల్లోకి
యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దివ్యాంగులు మీ సేవలో యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెలాఖరులో స్లాట్ బుకింగ్ ముగుస్తుంది. సదరం ఎప్పటిలాగే కొనసాగుతుంది. యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే కార్డు వస్తుంది.
–నాగిరెడ్డి, డీఆర్‌డీఓ
Comments
Please login to add a commentAdd a comment