మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ఆలయ ధ్వజస్తంభం, మహా నందీశ్వరుడి విగ్రహం ఎదుట శివానుగ్రహంతో విశ్వశాంతి కలిగి, లోకమంతా సురక్షితంగా ఉండాలని శైవాగమ సంప్రదాయంతో స్వస్తివాచన వేడుక, విఘ్నేశ్వర పూజలు నిర్వహించారు. అనంతరం పూజా ద్రవ్యాలతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి పుణ్యాహవాచన వేడుక జరిపించారు. అదే విధంగా మహా శివుడికి, ఆ తరువాత ఉత్సవ నిర్వాహకులు, యాజ్ఞికులు, అర్చకులు, అధికారులకు కంకణధారణ చేశారు. సాయంత్రం సమక, చమక పారాయణాలు, మంత్ర పుష్ప పఠనాలు, అంకురారోపణం, సోమకుంభ కలశస్థాపన, దేవతారాధన పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
అఖండజ్యోతి రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
భువనగిరి : యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల అఖండజ్యోతి రథయాత్ర పోస్టర్‌ను అదివారం భువనగిరిలోని వివేరా హోటల్‌లో ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం ఆవిష్కరించారు. రథయాత్ర అధ్యక్షుడు ఫక్కీర్ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శెట్టి బాలయ్య యాదవ్, సభ్యులు దేవరకొండ నర్సింహాచారి, కరిపే నర్సింగ్‌రావు, సత్యనారాయణరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉపేంద్రరావు, రాజయ్య, పింగళ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంతంగా
గురుకుల ప్రవేశ పరీక్ష
భువనగిరి: 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగన పరీక్షకు మొత్తం 3,678 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,522 మంది విద్యార్థులు హాజరయ్యారు. 156 మంది గైర్హాజరైనట్లు భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.
భువనగిరి మీదుగా
వెళ్లిన సీఎం కాన్వాయ్
భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భువనగిరి బైపాస్ మీదుగా వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు సీఎం కాన్వాయ్ వెళ్లింది. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని అనంతారం, శ్రీరేణుక ఎల్లమ్మ, సింగన్నగూడెం, నల్లగొండ రోడ్డు మార్గంలోని బైపాస్ రోడ్డు, రాయగిరి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు వెళ్తారని అంతా భావించారు. అధికారుల షెడ్యూల్‌లో కూడా హెలికాప్టర్ ద్వారానే వస్తారని వెల్లడించారు. కానీ, రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు వెళ్లారు.
‘ఐఎంఏ జూనియర్
డాక్టర్ల వైఖరి సరికాదు’
నల్లగొండ టౌన్ : గ్రామీణ స్థాయిలో ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుంచి కాపాడుతున్న గ్రామీణ వైద్యుల పట్ల ఐఎంఏ జూనియర్ డాక్టర్లు చులకన భావంతో మాట్లాడడం సరికాదని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. ఆదివారం నల్లగొండలోని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ కోదండరాం దిష్టిబొమ్మను ఐఎంఏ జూనియర్ డాక్టర్లు దగ్ధం చేయటం హేయమైన చర్య అన్నారు. గ్రామీణ వైద్యులు సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గతంలో ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు శిక్షణనిచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యం అందించాలని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో శ్రీనివాసరాజు, జి.నర్సింహారెడ్డి, సీహెచ్.బ్రహ్మచారి, డీఎస్‌ఎన్.చారి, నజీరుద్దీన్, వెంకటేశ్వర్లుగౌడ్, ఎం.మధనాచారి, యాదగిరి, లలిత, మణికుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment