ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ తనిఖీలు
యాదగిరిగుట్ట: తుర్కపల్లి మండలం, యాదగిరిగుట్ట పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని ఆర్‌కే ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఆపరేషన్ థియేటర్ అపరిశుభ్రంగా ఉండడం, సిజేరియన్లు అధికంగా జరగడాన్ని అధికారులు గుర్తించారు. అదే విధంగా తుర్కపల్లిలోని నక్షత్ర ఆస్పత్రి, మాదాపూర్‌లోని శివసాయి, సాయిజ్యోతి క్లినిక్‌లో ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ –2010 ప్రకారం నమోదు చేసుకున్న వైద్యులు కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్లు సేవలందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఎంబీబీఎస్ వైద్యుడికి బదులుగా అర్హతలేని వ్యక్తి సేవలు అందజేస్తున్నట్లు గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్ తెలిపారు.ఐదు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల (అల్లోపతి, ఆయూష్) నిర్వాహకులకు ఈనెల 11వ తేదీన బ్లిష్‌మెంట్ యాక్ట్– 2010 పై అవగాహన కల్పించనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment