అగ్నివీర్‌ ఇండియన్‌ నేవీ ఉద్యోగాలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌ ఇండియన్‌ నేవీ ఉద్యోగాలకు ఎంపిక

Published Fri, Mar 7 2025 8:54 AM | Last Updated on Fri, Mar 7 2025 8:54 AM

అగ్నివీర్‌ ఇండియన్‌ నేవీ  ఉద్యోగాలకు ఎంపిక

అగ్నివీర్‌ ఇండియన్‌ నేవీ ఉద్యోగాలకు ఎంపిక

రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామయ్య డిఫెన్స్‌ అకాడమీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అగ్నివీర్‌ ఇండియన్‌ నేవీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అకాడమీలో మొదటి సంవత్సరం డిఫెన్స్‌ కోర్సు చదువుతున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎన్‌. అభిషేక్‌, సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కె. ప్రదీప్‌ జూలై నెలలో నిర్వహించిన ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ సీనియర్‌ సెకండరీ జాతీయస్థాయి పరీక్షలో ప్రతిభ చాటి ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం సాధించిన విద్యార్థులను అకాడమీ డైరెక్టర్‌ రామయ్య, శ్రీనివాస్‌, అధ్యాపకులు నగేష్‌, బొమ్ము శంకర్‌ అభినందించారు.

పాడి ఆవులు

విక్రయిస్తామని టోకరా

వాట్సాప్‌లో ఆవుల ఫొటోలు పెట్టి రూ.85,500 కొట్టేసిన దుండగుడు

భువనగిరి: వాట్సాప్‌లో ఫొటో పెట్టిన ఆవులను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి రూ.85వేలు పంపి మోసపోయాడు. ఈ ఘటన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు ఈ నెల 5వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పాడి ఆవుల ఫొటోలు పెట్టి వాటిని అమ్ముతామని చెప్పాడు. వాట్సాప్‌లో పెట్టిన ఆవులలో మూడు మాత్రమే ఎంపిక చేసుకుని ఫోన్‌పే ద్వారా రూ.1,05,000 పంపాలని సూచించాడు. గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన ముత్తిరెడ్డిగూడెం వాసి మూడు ఆవులను ఎంపిక చేసుకుని ఫోన్‌ పే ద్వారా రూ.85,500 పంపాడు. డబ్బులు పూర్తిగా పంపితేనే ఆవులను పంపిస్తామని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు గేదెలు, ఆవులను అమ్ముతామని ఫోన్‌ చేస్తే నమ్మవద్దని ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సూచించారు.

ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్‌పై విచారణ వేగవంతం

నిందితులను పట్టుకునేందుకు

మధ్యప్రదేశ్‌కు వెళ్లిన నకిరేకల్‌ పోలీసులు

నకిరేకల్‌: నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్‌ నంబర్‌ మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి విమానంలో నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్‌కు పయనయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కారు ఢీకొని

యువకుడు మృతి

బీబీనగర్‌: బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బీబీనగర్‌ మండలం నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో జరిగింది. సీఐ ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల సూర్యప్రసాద్‌(24) బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో బీబీనగర్‌ నుంచి బైక్‌పై బ్రహ్మణపల్లికి వెళ్తుండగా.. నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో హిందుస్థాన్‌ శానిటరీ వేర్‌ పరిశ్రమ గోడౌన్‌ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రసాద్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు భానుచందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement