
అడవిని హరిస్తున్న అగ్నికీలలు
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం తీరం వెంట గల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ జోన్‌లో వారానికి రెండు చోట్ల మంటలు చెలరేగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అగ్నిప్రమాదాలు ఆగడం లేదు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. గత వారం రెండ్లు సార్లు కృష్ణా నది తీరంలో జమ్మనకోట ప్రాంతంలో రాత్రివేళ అడవికి నిప్పంటుకుంది. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు దగ్గరలో గల తండావాసుల సహకారంతో చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఒకసారి సుమారు 8 నుంచి 10ఎకరాల మేర, రెండోసారి 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయింది. అటవీ ప్రాంతంలో రాలిపోయిన ఆకులతో పాటు చిన్న చిన్న చెట్లు తగలబడ్డాయి. రెండేళ్ల క్రితం కూడా దయ్యాలగండి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో నాగాలారం ప్రాంతంలో మూడేళ్ల క్రితం మంటలు అంటుకోని 100 ఎకరాల మేర అడవి తగలబడింది.
అటవీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు..
అటవీ ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులు, పశువుల కాపరులు ప్రవేశించడంపై నిషేధం విధించినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అడవుల్లో చెట్ల ఆకులు రాలడంతో పాటు వేసవిలో ఎండలు మండుతున్న దృష్ట్యా నల్లమల, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని గ్రామాల్లో కళాజాతతో ప్రచారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నల్లగొండ–మహబూబ్‌నగర్ జిల్లాల మధ్యన కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 2,166 చదరపు కిలోమీటర్ల మేర అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఆకురాలే సమయం కావడంతో తరచూ ఇక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో అడవిలో నివసించే జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
తీసుకోవాల్సిన చర్యలు
అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగానే అటవీ ప్రాంత శివారులో నివసించే ప్రజలకు అవగాహన కల్పించాలి. అడవిలోకి వేసవిలో జీవాలను, పశువులను రాకుండా చూడాలి. అగ్గిపెట్టె, కిరోసిన్, పెట్రోల్ లాంటి వాటిని అడవిలోకి తీసుకురాకుండా నిషేధించాలి. అడవిలో ఆకులు రాలే చోట ట్రంచులు ఏర్పాటు చేయాలి. చెక్‌డ్యాంలు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చూడాలి. అవసరమైన సమయంలో ఆ నీటిని మంటలార్పేందుకు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఎత్తైన వాచ్‌టవర్లు ఏర్పాటు చేసి వేసవిలో మనుషులు అడవిలోకి రాకుండా గమనించాలి.
ఫ నల్లమల, అమ్రాబాద్ టైగర్
రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ జోన్‌లో
చెలరేగుతున్న మంటలు
ఫ ప్రతీ వారం ఎక్కడో ఒకచోట
తగలబడుతున్న అటవీ ప్రాంతం
ఫ అడవిలో జీవాలను మేపడం
నిషేధించిన అటవీ శాఖ అధికారులు
అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం
అటవీ ప్రాంతంలో తరచూ మంటలు లేచే ప్రాంతాలను గుర్తించి ఫైర్ ట్రస్సింగ్ లైన్లు కొట్టించాం. బఫర్ జోన్‌లో రహదారులకు ఇరువైపులా కంపచెట్లు తొలగించాం. చాలా చోట్ల ఫైర్‌వాల్స్ కూడా ఏర్పాటు చేశాం. అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. ఈ వేసవిలో జీవాలు అడవిలోకి వెళ్లకుండా నిషేధించాం. శివారు తండాలు, గ్రామాల ప్రజలకు అగ్నిప్రమాదాలు సంభవించకుండా అవగాహన కల్పిస్తున్నాం. – రాఘవేందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాగార్జునసాగర్

అడవిని హరిస్తున్న అగ్నికీలలు
Comments
Please login to add a commentAdd a comment