
పాతర్లపహాడ్‌లో విషాదఛాయలు
ఫ ఏపీలోని నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో
గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు మృతి
నెల్లూరు క్రైం, ఆత్మకూర్(ఎస్): ఏపీలోని నెల్లూరు పట్టణంలోని శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు మృతిచెందారు. దీంతో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన మోహనంది మల్లయ్య, నాగమణి దంపతులకు నిషిత (22), కార్తీక్ (20) సంతానం. మల్లయ్య సూర్యాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుమార్తెను బీటెక్, కుమారుడిని డిప్లొమా చదివిస్తున్నాడు. ఇటీవల నిషిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందడంతో మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబంతా కలిసి తిరుపతికి వెళ్లారు. ఈ నెల 6న తిరుమలకు వెళ్లిన వారు.. దర్శనానంతరం తిరిగి తమ ఊరెళ్లేందుకు తిరుపతికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌కు బయల్దేరగా మార్గమధ్యలో ఇన్నోవా కారు డ్రైవర్ కలిసి తాను విజయవాడకు వెళ్తున్నానని చెప్పారు. దీంతో వీరు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో నెల్లూరు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీ జంక్షన్ వద్దకు రాగానే కారు డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొని ఆపై లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నిషిత, కార్తీక్ అక్కడికక్కడే మృతిచెందగా, వారి తల్లిదండ్రులు, కారు డ్రైవర్ శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం
ఫ కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
మద్దిరాల: నెలరోజుల క్రితం అదృశ్యమైన మద్దిరాల మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ కుందూరు వసంత ఆచూకీ శనివారం లభ్యమైంది. ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. వసంత నల్లగొండ సమీపంలో కిందపడడంతో ఆమె తలకు గాయామై మతిస్థిమితం కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పలేని స్థితిలో ఉండడంతో నల్లగొండలోని ఓ ఆశ్రమంలో ఉంచారు. ఇటీవల అక్కడి పోలీసులు సమాచారం అందించడంతో ఆమెను కుందూరు వసంతగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు శనివారం అప్పజెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. వసంత ఆచూకీ కనిపెట్టిన పోలీసులకు, ఆశ్రమ నిర్వాహకులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పాతర్లపహాడ్‌లో విషాదఛాయలు

పాతర్లపహాడ్‌లో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment