
కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య
అడ్డగూడూరు: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోటమర్తి గ్రామానికి చెందిన నిమ్మల సతీష్(35)కు తొమ్మిదేళ్ల క్రితం తిరుమలగిరి మండలం గూడెపురి గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. తనకు కుమారుడు పుట్టలేదని సతీష్ తాగి వచ్చి తరచూ భార్య స్వప్నతో గొడవపడుతుండేవాడు. ఈ నెల 5వ తేదీన సైతం స్వప్నతో గొడవపడి కొట్టడంతో ఆమె తన కుమార్తెలను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మరుసటి రోజు స్వప్న తల్లి కుమార్తెను తీసుకుని కోటమర్తికి వచ్చి అల్లుడికి నచ్చజెప్పింది. శుక్రవారం రాత్రి సతీష్, స్వప్న, ఇద్దరు పిల్లలు ఒక గదిలో, స్వప్న తల్లి మరో గదిలో నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో సతీష్ బెడ్‌షీట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున స్వప్న తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. సతీష్ ఉరికి వేలాడుతుండటం గమనించి బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి అప్పటికే సతీష్ మృతిచెందాడు. మృతుడి భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment