టీటీడీ తరహాలోనే.. గుట్టకు పాలకమండలి
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి త్వరలో ఏర్పాటు కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు తరహాలోనే గుట్ట పాలకమండలి ఉండాలన్నది సీఎం అభిప్రాయం. అందుకు అనుగుణంగానే పాలకమండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దేవస్థానం ఉంటుంది. దేవాదాయ శాఖ ఆజమాయిషీ ఉండదు. దేవస్థానం ఈఓ, ఉద్యోగుల నియామకాలు, బదిలీలు ప్రభుత్వ పరిధిలోనే జరగనున్నాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్ అధికారి లేదా అదనపు కమిషనర్ క్యాడర్ స్థాయి అధికారి ఉంటారు. 17 ఏళ్లుగా అధికారుల పాలనలో కొనసాగుతున్న దేవస్థానం ప్రజాప్రతినిధుల చేతుల్లోకి రానుంది.
పాలకమండలిలో ఉండేది వీరే..
చైర్మన్, 10 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు కానుంది. ఇందులో ఒకరు వంశపారంపర్య ధర్మకర్త కాగా మిగతా తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రూపొందించిన నోట్‌కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేవాదాయశాఖ చట్టం–1987లోని చాప్టర్ 14 కింద యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని చేర్చినట్లు సమాచారం. పాలకమండలిలో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment