హుజూర్‌నగర్: ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన గురువారం చింతలపాలెం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని నెహ్రూనగర్‌కు చెందిన తాటికొండ నగేష్ (45) ఓ దినపత్రికలో రూట్ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. దొండపాడు నుంచి ఆటో నడుపుకుంటూ చింతలపాలెం వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాంధీనగర్ తండా వద్దకు రాగానే ఎదురుగా ట్రాక్టర్‌లో మిర్చిలోడు వేసుకొని వస్తున్న అజ్మీరగాంధీ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ తాటికొండ నగేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నగేష్ అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి మేనల్లుడు బిక్కుమల్ల ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం
ఆలేరురూరల్: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని పెట్రోల్ బంక్‌లో నిలిపి ఉంచిన రెండు ద్విచక్రవాహనాలు గురువారం తెల్లవారు జామున దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలనుపాక గ్రామంలో పెట్రోల్ బంక్(గాయత్రి ఫిలింగ స్టేషన్)లో బక్క నరేష్, నల్ల పరుశరాములు పని చేస్తున్నారు. రోజులాగే బంకులో వారి బైక్‌లను పక్కన నిలిపారు. రాత్రి బంక్‌లో నిద్రపోయారు. తెల్లవారుజామున చూసే సరికి రెండు బైక్‌లు పూర్తిగా దగ్ధమై ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా చేశారు. బంక్ యజమాని ఆరె పాండు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రజనీకర్ తెలిపారు.