భువనగిరిటౌన్: ఈ ఏడాది ఆస్తిపన్ను వసూళ్ల గడువు ముగిసింది. భువనగిరి మున్సిపాలిటీలో ఈ ఏడాది 2024– 2025 మార్చి 31 వరకు 62.05 శాతం ఆస్తి పన్ను వసూలైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రూ.9.80 కోట్లు ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా రూ.6.08 కోట్లు వసూలు చేశారు. మున్సిపల్ శాఖ 90శాతం వడ్డీ రాయితీ ప్రకటించినా కేవలం 10శాతం మాత్రమే పన్ను చెల్లించడం గమనార్హం. పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.
క్రికెట్‌లో ఉచిత శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుంచి ఔట్‌డోర్ స్టేడియంలో క్రికెట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ అమీనుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 19 సంవత్సరాలలోపు బాల బాలికలకు శిక్షణ ఇస్తామని, ఇతర వివరాలకు 9885717996 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.
ప్రతిఒక్కరూ సన్మార్గంలో పయనించాలి
భూదాన్‌పోచంపల్లి : ప్రతిఒక్కరూ సన్మార్గంలో పయనించాలని వేదాంత గీత శివం ఫౌండర్ శ్రీ అభినవ శంకరానంద స్వామి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వరస్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక భక్త సమాజం యతీకుటీరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన సదస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వేద శాస్త్రాల్లో ఉన్న సారం, తత్వ జ్ఞానాన్ని పెంపొందించుకుని తమ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక భక్త సమాజం అధ్యక్షుడు భారత పురుషోత్తం, శ్రీమార్కండేశ్వరస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ సీత సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి అంకం యాదగిరి, ఎల్లప్ప, నోముల అశోక్, కటకం తుకారాం, నర్సింహ పాల్గొన్నారు.
వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుని కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహుని నిత్య కల్యాణం మంగళవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి విశేష పూజలు, అర్చనలు గావించారు. అదేవిధంగా నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు.
నిత్యకల్యాణంలో భాగంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుని కల్యాణం

ప్రతిఒక్కరూ సన్మార్గంలో పయనించాలి