
పన్ను చెల్లింపులో పల్లెలే ఫస్ట్
428 గ్రామ పంచాయతీల్లో 92 శాతం వసూలు
● భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.9.80 కోట్లు కాగా రూ.6.08 కోట్లు (62.05శాతం) వసూలైంది.
● మోత్కూర్‌లో రూ.1.25 కోట్లకు గాను రూ.98 లక్షలు(78.28శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.27 లక్షలు వసూలు కావాల్సి ఉంది.
● యాదగిరిగుట్టలో రూ.3.25 కోట్లు డిమాండ్‌కు కాగా రూ.2.22 కోట్లు (68.28 శాతం) రాబట్టారు. రూ.1.3కోట్లు పెండింగ్ ఉంది.
● భూదాన్‌పోచంపల్లిలో రూ.2.8కోట్లకు రూ.85.57 (62.39) శాతం సమకూరింది.
● ఆలేరులో రూ.2.26 కోట్లకు రూ.1.41 కోట్లు (62.39 శాతం) వసూలయ్యాయి.
● చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.7.34 కోట్లు లక్ష్యం కాగా రూ.5.30 కోట్లు(72.20శాతం) వసూలయ్యాయి.
భువనగిరిటౌన్ : అభివృద్ధిలో పట్టణాలతో పోటీ పడుతున్న గ్రామ పంచాయతీలు ఆస్తిపన్ను వసూళ్లలోనూ ముందజంలో నిలుస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 428 గ్రామ పంచాయతీల్లో 92 శాతం పన్నులు వసూలు కాగా.. ఆరు మున్సిపాలిటీల్లో 70శాతం లోపే వసూలయ్యాయి. లక్ష్యం చేరుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టినా, బకాయిదారులకు 90 శాతం వడ్డీ రాయితీ అవకాశం కల్పించినా ఫలితం లేకపోయింది.
పంచాయతీలే ముందంజ
జిల్లాలోని 17 గ్రామ పంచాయతీల్లో 428 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఆస్తిపన్ను డిమాండ్ రూ.16.83 కోట్లు కాగా.. రూ.15.47 కోట్లు (92శాతం) రాబట్టారు. కేవలం రూ.1.36 కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా 99 శాతం పన్ను వసూలుతో భూదాన్‌పోచంపల్లి మండలం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత చౌటుప్పల్ మండలం 97 శాతంతో రెండో స్థానంలో ఉంది. మిగితా మండలాల్లోనూ 90శాతానికి పైగా పన్ను వసూలైంది. గడిచిన ఐదారేళ్లుగా గ్రామ పంచాయతీల్లో లక్ష్యానికి అనుగుణంగా ఆస్తిపన్ను వసూలవుతోంది. పంచాయతీలకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించడం ఆస్తిపన్ను వసూళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు.
పట్టణాల్లో 70 శాతం లోపే..
జిల్లాలో భువనగిరి, ఆలేరు. చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, మోత్కుర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో నివాస, వ్యాపార, వాణిజ్య భవనాలు 15,123 వరకు ఉన్నాయి. వాటినుంచి రూ.26.47 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉండగా.. రూ.20 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ.8 కోట్లకు పైనే పెండింగ్‌లో ఉంది. పన్నుల వసూళ్ల కోసం అధికారులు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా ఆటోలు, సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం చేశారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా పన్ను చెల్లింపుతో పాటు గత బకాయిలను మార్చి 31వ తేదీ లోపు పూర్తిగా చెల్లిస్తే వన్‌టైం సెటిల్‌మెంట్ కింద (ఓటీఎస్) 90 శాతం వడ్డీ రాయితీ అవకాశాన్ని మున్సిపల్ శాఖ కల్పించింది. పండుగలు, సెలవు రోజుల్లో ప్రజలు పన్నులు చెల్లించేలా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయినా లక్ష్యానికి దూరంగా నిలిచిపోయాయి.
ఫ మున్సిపాలిటీల్లో 70 శాతం లోపే..
ఫ బకాయిలు రాబట్టడంలో అధికారులు విఫలం
ఆస్తిపన్ను (రూ.కోట్లలో)
పంచాయతీలు 428
డిమాండ్ 16.83
వసూలైంది 15.47
మున్సిపాలిటీలు 06
డిమాండ్ 26.47
వసూలైంది 20