
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 7తులాల బంగారం, వెండి
ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
మునుగోడు: మునుగోడు మండలం కచలాపురం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. కచలాపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. వారి ఇల్లు గ్రామ శివారులో ఉండటంతో తాళం వేయడం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యాహ్న తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలోని సుమారు 7తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సాయంత్రం వ్యవసాయ బావి వద్ద నుంచి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బీరువాలోని వస్తువులు చిందరవదరగా పడేసి ఉండటం గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.