
దరఖాస్తులకు సత్వర పరిష్కారం
సాక్షి,యాదాద్రి : సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వస్తున్న వినతులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించలేనివి ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాగా వివిధ సమస్యలపై 59 దరఖాస్తులు రాగా.. అందులో 38 వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. పంచాయతీ రాజ్ 7, వైద్య 2, సర్వే ల్యాండ్స్, విద్య, వ్యవసాయ, హౌసింగ్, లీడ్ బ్యాంకుకు సంబంధించి ఒక్కొకటి చొప్పున ఆర్జీలు ఉన్నాయి. వినతులు స్వీకరించిన వారిలో జెడ్పీ సీఈఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● రుణమాఫీ కాలేదని బొమ్మలరామారం, మర్యాల, చీకటిమామిడి గ్రామాలకు చెందిన పలువురు రైతులు కోరారు. ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారిన తర్వాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారిందని, దీంతో సాంకేతికంగా సమస్య తలెత్తడంతో రుణమాఫీ కాలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
● గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం రాజాపేట మండలం బేగంపేట రెవెన్యూ పరిధిలో సుమారు 80 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంది.. పట్టాదారు పాస్ పుస్తకాల్లో నుంచి భూములను తొలగించారు.. ఆరేళ్లు కావస్తున్నా పరిహారం చెల్లించలేదని బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. జాప్యం చేయకుండా పరిహారం ఇవ్వాలని, లేనట్లయితే భూములను తమ ఖాతాల్లో తిరిగి చేర్చాలని విన్నవించారు.
● అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ పొంది ఏడాది గడుస్తున్నా వారికి ప్రభుత్వం నుంచి బెన్‌ఫిట్స్ అందడం లేదని సీఐటీయూ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. జిల్లాలో 100 మంది వరకు రిటైర్మెంట్ అయ్యారని, ఆలస్యం చేయకుండా బెన్‌ఫిట్స్ అందజేయాలని కోరారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
ఫ ప్రజావాణిలో వినతుల స్వీకరణ
మైక్రో ఫైనాన్స్‌ల ముప్పు తప్పించండి
మైక్రో ఫైనాన్స్‌ల ఆగడాలను అరికట్టాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం సంఘ బంధం సభ్యులు విన్నవించారు. యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో నాగార్జున ఫిన్‌కేర్, రుద్రమదేవి, సౌభాగ్యలక్ష్మి తదితర మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నాయని ఆరోపించారు. దీంతో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్ రుణాలు పొందిన సంఘాల సభ్యులు సక్రమంగా కిస్తులు చెల్లించడం లేదని, రికవరీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అతేకాకుండా కొత్తగా పురుషులతో కూడా సంఘాలు ఏర్పాటు చేయిస్తూ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీవోఏ, ఏపీఎంలపై రాజకీయంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే మైక్రో ఫైనాన్స్ సంస్థల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరారు.

దరఖాస్తులకు సత్వర పరిష్కారం