
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
కేతేపల్లి: కేతేపల్లి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి అశోక్ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై నకిరేకల్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పల్లె రుచులు హాటల్ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్ కుడి కాలు పూర్తిగా తెగిపోయి ప్రమాద స్థలంలో పడిపోయింది. అశోక్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అదేవిధంగా చెర్కుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెర్కుపల్లి గ్రామానికి చెందిన మున్న శివ ఆదివారం రాత్రి పక్కనే ఉన్న కొండకిందిగూడెం గ్రామం నుంచి బైక్‌పై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం రాశి పైకి బైక్ దూసుకెళ్లి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మొదట సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.