
నల్లగొండ రీజియన్‌కు 152 ఎలక్ట్రిక్ బస్సులు
భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో బస్సుల కొరత తీరనుంది. డొక్కుబస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. 152 బస్సులు కేటాయించగా.. వీటిలో 41 బస్సులు సూర్యాపేట డిపోకు చేరుకున్నాయి. మిగితావి త్వరలోనే ఆయా డిపోలకు రానున్నాయి. ఈ బస్సులన్నీ చార్జింగ్‌తోనే నడవనున్నాయి. సూర్యాపేట, నల్లగొండలో ఈ చార్జింగ్ పాయింట్ల పనులు వేగంగా సాగుతున్నాయి.
రెండుచోట్ల చార్జింగ్ పాయింట్లు
ఆర్టీసీ సంస్థ కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో ప్రధాన బస్టాండ్ అయిన సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.ఇక్కడ రోజుకు ఐదారు బస్సులకు మా త్రమే చార్జింగ్ పెడుతున్నారు. సూర్యాపేట డిపోకు దాదాపు 77 బస్సులు రావడంతో కొత్తబస్టాండ్ డిపో ఆవరణలోనూ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండలో కూడా చార్జింగ్ పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా బస్టాండ్ల నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ మొత్తంలో బస్సులను నడపనున్నారు. నల్లగొండ – సూర్యాపేట, సూర్యాపేట – వరంగల్, సూర్యాపేట – ఖమ్మం, నల్లగొండ– మిర్యాలగూడ రూట్లలో ఇలా డిపోల పరిధిలో బస్సులను నడపనున్నారు.
ఫ సూర్యాపేట డిపోకు 75, నల్లగొండకు 77 కేటాయింపు
ఫ త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు
ప్రయాణికులకు మెరుగైన రవాణా
మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడానికి ఆర్టీసీ అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతోంది. త్వరలోనే రీజియన్‌కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి. బస్సుల కొరత తీరడంతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందనుంది.
–జాన్‌రెడ్డి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్