
సద్దుమణిగిన ‘మదర్ డెయిరీ’ అసమ్మతి
సాక్షి,యాదాద్రి: మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన సొంత పార్టీకి చెందిన డైరెక్టర్లతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమావేశం కావడంతో వారు కాస్త మెత్తబడ్డారు. చైర్మన్‌ను మార్చాలన్న 10 మంది కాంగ్రెస్ డైరెక్టర్లకు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు డైరెక్టర్లు కూడామద్దతు ప్రకటించారు. నేడో రేపో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం రాత్రి యాదగిరిగుట్టలో మదర్ డెయిరీ చైర్మన్, డైరెక్టర్లతో ప్రభుత్వ విప్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరువర్గాలు వారి వాదనలు గట్టిగా వినిపించారు. అనంతరం అవిశ్వాసం ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వ విప్ డైరెక్టర్లను కోరగా.. వారు కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఫ చైర్మన్‌గా గెలిచిన నాటి నుంచి మధుసూదన్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ సమావేశంలో డైరెక్టర్లు ఆరోపించారు. ప్రైవేట్ పాల కొనుగోలులో చైర్మన్ కమీషన్లు తీసుకుంటున్నాడని, ఉద్యోగులను ఏకపక్షంగా బదిలీ చేశారని, పాల బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నాడని డైరెక్టర్లు వివరించారు. తమలో ఒకరికి అవకాశం ఇస్తే డెయిరీని లాభాల బాట పట్టిస్తామని, అందుకే అవిశ్వాసం పెట్టామని పేర్కొన్నారు.
ఫ అయితే మాజీ చైర్మన్‌ల డైరెక్షన్‌లో డైరెక్టర్లంతా కలిసి తనపై కుట్ర చేస్తున్నారని చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. గత పాలకవర్గంలో కొందరు డైరెక్టర్లు చిల్లింగ్ సెంటర్లలో అక్రమాలకు పాల్పడగా.. వాటిని తాను చైర్మన్ అయిన తర్వాత బట్టబయలు చేయడం కొందరికి నచ్చడంలేదని పేర్కొన్నారు. డెయిరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రోజు లక్ష లీటర్ల పాల అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రైవేట్‌గా రోజు 40వేల లీటర్ల పాలు కొనక తప్పడంలేదని, డైరక్టర్లనే పాలు సరఫరా చేయాలని కోరినా ఎవరూ స్పందించడంలేదని వివరించారు. ప్రతినెలా జీతాలు, పాత బాకీలకు వడ్డీలు, నిర్వహణ ఖర్చులకే రూ.3 కోట్లు అవసరమవుతాయని చైర్మన్‌న పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు..
మదర్ డెయిరీ పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు కావొస్తుంది. మొత్తం 15 మంది డైరెక్టర్లలో 11 మంది కాంగ్రెస్, నలుగురు బీఆర్‌ఎస్ డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చైర్మన్ గాక అధికార పార్టీకి చెందిన మిగతా పది మంది అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వీరికి నలుగురు బీఆర్‌ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇస్తామన్నారు. దీంతో అవిశ్వాసం తప్పదన్న చర్చ ప్రారంభమైంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను రంగంలోకి దింపగా.. తాత్కాలికంగా అవిశ్వాసంపై వెనక్కి తగ్గినట్లు ఓ డైరెక్టర్ సాక్షితో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మదర్ డెయిరీ ఎన్నికల జరిగిన తర్వాత మరోసారి అవిశ్వాసంపై ఆలోచన చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఫ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు
డైరెక్టర్ల ప్రయత్నం
ఫ డైరెక్టర్లు, చైర్మన్‌తో సమావేశం
నిర్వహించిన ప్రభుత్వ విప్ ఐలయ్య
ఫ ఆయన నచ్చజెప్పడంతో వెనక్కి
తగ్గిన డైరెక్టర్లు