
డ్రిప్‌ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నడిగూడెం: రాయితీపై తీసుకున్న సూక్ష్మ సేద్యపు పరికరాలు(డ్రిప్, స్ప్రింక్లర్లు) రెండోసారి తీసుకోవాలంటే ఏడేళ్లు ఆగాలని, అంతవరకు వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్‌కుమార్ అన్నారు. ప్రస్తుత వేసవిలో ఉద్యానవన పంటల సాగుకు నీరు చాలా అవసరమని, ఇలాంటి సమయంలో డ్రిప్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెబుతున్నారు.
ఫ ఒకసారి పొలంలో అమర్చుకున్న డ్రిప్ పరికరాలను రైతులు జాగ్రత్తగా వాడుకోవాలి. వాటి పనితీరు, చిన్నపాటి మరమ్మతుల గురించి అవగాహన కలిగి ఉండాలి. డ్రిప్ సిస్టమ్ హెడ్ కంట్రోల్ యూనిట్‌లో వివిధ రకాల ఫిల్టర్లు నీటిలోని ఇసుక, ఆల్గే(నాచు) చెత్త, మలినాలు వేరు చేసేందుకు అమర్చబడి ఉంటాయి. అవి మూసుకుపోకుండా ఫిల్టర్లను తరచూ శుభ్రం చేసుకోవాలి. అందులో ఇసుక ఫిల్టర్‌ను బ్యాక్‌వాష్ పద్ధతిలో శుభ్రం చేసుకోవాలంటే అందులో ఉండే నాలుగు వాల్వ్‌ల గురించి తెలుసుకోవాలి. సిస్టమ్ నడుస్తున్నప్పుడు 2, 4 నంబర్ వాల్వులు తెరిచి 1, 3 నంబర్ వాల్వులు పూర్తిగా మూసివేసి నీటిని పంపండం ద్వారా ఇసుక బెడ్ శుభ్రపడతాయి. రెండో పద్ధతిలో ఇసుక బెడ్‌లోని ఖాళీలు మూసుకుపోయినప్పుడు ముందుగా 1, 3 నంబర్ వాల్వులు తెరిచి 2, 4 నంబర్ వాల్వులు మూసేసి నీటిని నింపడం ద్వారా అందులో మలినాలు 1వ నంబర్ వాల్వ్ ద్వారా బయటకు పోయి ఇసుక బెడ్ శుభ్రమవుతుంది. ఈ పద్ధతిని శాండ్ ఫిల్టర్ అమర్చిన రెండు ఫ్రెషర్ గేజ్‌లను మధ్య తేడా 0.5 కిలో లేదా 0.5.సెం.మీ కన్నా ఎక్కువ పెరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్ ఇసుక ఉండాల్సిన మట్టానికి తక్కువైనప్పుడు తిరిగి మట్టానికి ఇసుక నింపుకోవాలి. బ్యాక్‌వాష్ చేసే ముందు శ్యాండ్ ఫిల్టర్ మూత తెరిచి చేతులతో ఇసుక బెడ్‌ను కలియబెట్టాలి. ఇలా చేయడం వలన ఫిల్టర్‌ను తొందరగా శుభ్రం చేసుకోవచ్చు.
స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం ఇలా..
సిస్టం నడుస్తుండగా స్క్రీన్ ఫిల్టర్‌ను శుభ్రం చేసుకోవాలంటే ఫిల్టర్ కింది భాగంలో అమర్చిన డ్రైన్ వాల్వ్‌ను తెరిస్తే స్క్రీన్ మెష్‌పై ఉన్న మలినాలు ఈ వాల్వ్ ద్వారా బయటకుపోతాయి. చాలాసార్లు మలినాలు ఫిల్టర్ మెష్‌పై పేరుకుపోయి మెష్‌పైనే అంటుకొని ఉంటాయి. అలాంటప్పుడు పంప్ ఆఫ్ చేసి ఫిల్టర్ మూతను తెరిచి ఫిల్టర్‌లోని మెష్‌ను బయటకు తీసి పేరుకపోయిన మలినాలను సున్నితమైన ప్లాస్టిక్ బ్రష్ లేదా చేతివేళ్లతో శుభ్రం చేయాలి. (మెష్ చిరిగిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి) స్క్రీన్ ఫిల్టర్‌లో మెష్ లేకుండా నడపకూడదు. పేడ, ఇతర సేంద్రియ ఎరువులను డ్రిప్ ద్వారా పంపకూడదు. దీని వల్ల ఫిల్టర్లు, డ్రిప్పర్లు మూసుకపోతాయి. ఇక పీవీసీ పైపులు, లేటరల్ పైపులు శుభ్రం చేసుకొనేందుకు ఎండ్ క్యాప్ లేదా ఎండ్ ప్లగ్ ప్రతివారం లేదా కనీసం 15 రోజులకోసారి తెరచి నీటిని పూర్తి ప్రెషర్‌తో లోపలికి పంపితే ఎండ్ ప్లగ్ చివర్ల ద్వారా మలినాలు బయటకు కొట్టుకపోతాయి. మూడు నెలలకొకసారి లేదంటే కనీసం ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా యాసిడ్ ట్రీట్‌మెంట్ ద్వారా డ్రిప్ యూనిట్‌ను శుభ్రం చేసుకోవాలి. యాసిడ్ ట్రీట్‌మెంట్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

డ్రిప్‌ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు