
భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
రామన్నపేట: భర్త వేధింపులు భరించలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న భర్త కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణానికి చెందిన బొబ్బిలి మల్లయ్య కుమార్తె కావ్య(25)ను 2018లో రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామానికి చెందిన జినుకల ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఆరేళ్ల లోపు వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వారం క్రితం అదనపు కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన కావ్యపై భర్త ఆంజనేయులు చేయి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మానసిన వేదనకు గురైన కావ్య గురువారం ఉదయం తమ వ్యవసాయబావి వద్ద పశువుల కొట్టంలో ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన ఆమె భర్త ఆంజనేయులు వలిగొండ సమీపంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడికి రామన్నపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. మల్లయ్య తెలిపారు.
ఫ గడ్డి మందు తాగి భర్త కూడా
ఆత్మహత్యాయత్నం