
హాషిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
భువనగిరి: రూ.80 లక్షలు విలువ చేసే మత్తు పదార్థమైన హాషిష్ ఆయిల్‌ను తరలిస్తున్న ఇద్దరిని ఎస్‌ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషరేట్‌లో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాకు చెందిన పెట్ల శేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని శ్రీవిద్యా కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేసే దుర్గా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హషిష్ ఆయిల్ సరఫరా చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో శేఖర్ తన చిన్ననాటి స్నేహితుడైన అనిమినిరెడ్డి దుర్గారావును కలిసి హాషిష్ ఆయిల్ గురించి వివరించాడు. దీంతో దుర్గా నుంచి హాషిష్ ఆయిల్ సేకరించి ఇద్దరు తమకు తెలిసిన ప్రాంతాల్లో అవసరమైన వారికి విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శేఖర్, దుర్గారావులు దుర్గా వద్ద సుమారు 4 కేజీల హాషిష్ ఆయిల్ కొనుగోలు చేశారు. భువనగిరి రైల్వేస్టేషన్‌లో దిగి మండలంలోని అనంతారం గ్రామానికి వెళ్లే సర్వీస్ రోడ్డు మార్గంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో సమాచారం మేరకు ఎస్‌ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. వారి వద్ద 4 కేజీల హాషిష్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, దుర్గా పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎస్‌ఓటీ పోలీసులు, రూరల్ ఎస్‌హెచ్‌ఓ సంతోష్‌కుమార్ ఉన్నారు.
రూ.80లక్షల విలువగల హాషిష్
ఆయిల్ స్వాధీనం