
కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామానికి చెందిన అప్పల కొండయ్య కుమారుడు ఆదిత్య(27), ఊర ముత్తయ్య కుమారుడు ప్రవీణ్(25) చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిద్దరు ఆదివారం రాత్రి కొత్తపేట నుంచి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో చీకటిగూడెం గ్రామ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై ఉన్న జంక్షన్ వద్ద సూర్యాపేట వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుపుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివతేజ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి

కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు