
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో రోగి మృతి
మిర్యాలగూడ అర్బన్: మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చేరిన రోగి బుధవారం మృతిచెందాడు. అయితే ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందాడని ఆరోపిస్తూ బుధవారం ఆస్పత్రి ఎదుట మృతుడి బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల పరిధిలోని బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన మొండికత్తి క్రిష్ణయ్య(70) గత కొంతకాలంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు బాధపడుతున్నాడు. దీంతో ఈ నెల 14వ తేదీన అతడిని కుటుంబ సభ్యులు మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. క్రిష్ణయ్యను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం క్రిష్ణయ్యకు ఆస్పత్రి సిబ్బంది సైలెన్ బాటిల్ పెట్టి ఓ ఇంజక్షన్ ఇవ్వగా.. అతడి నోటి వెంట నురగ రావడంతో పాటు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది సీపీఆర్ చేసి పరీక్షించగా అప్పటికే అతడు మృతిచెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే క్రిష్ణయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడారు. ఈ ఘటనపై మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస సమరధ్‌ను వివరణ కోరగా.. ఇంజక్షన్ వికటించి క్రిష్ణయ్య మృతిచెందలేదని, ఇందులో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. క్రిష్ణయ్య గుండెపోటు వచ్చి మృతిచెంది ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఫ వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఫ గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చన్న సూపరింటెండెంట్