
తమ్ముడి మామే సూత్రధారి
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన నలుగురికి బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్‌కు చెందిన గద్దపాటి సురేష్ నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో మణికంఠ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. సురేష్ తమ్ముడు నరేష్‌కు 2017లో హైదరాబాద్‌కు చెందిన మాతరి వెంకటయ్య కుమార్తె ఉమామహేశ్వరితో వివాహమైంది. కొన్నాళ్ల వరకు నరేష్ సంసారం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భార్యను దూరంగా ఉంచడంతో పాటు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే తన కుమార్తె సంసారం నాశనం కావడానికి తన అల్లుడైన నరేష్ అన్న సురేషే కారణమని మాతరి వెంకటయ్య భావించాడు. సురేష్ కూడా వేరే మహిళతో చాలాకాలంగా సాన్నిహిత్యంగా ఉంటూ తన భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలియడంతో పాటు నరేష్ వివాహేతర సంబంధాన్ని సురేష్ ప్రోత్సహిస్తున్నాడని నమ్మిన మాతరి వెంకటయ్య ఎలాగైనా సురేష్‌ను అంతమొందిస్తే తన అల్లుడు నరేష్‌కు బుద్ధి వచ్చి తన కుమార్తెతో మంచిగా ఉంటాడని భావించాడు.
సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం..
ఈ మేరకు మాతరి వెంకటయ్య హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్‌కుమార్ అలియాస్ సీకే కిరణ్‌కుమార్‌ను సంప్రదించి అతడి ద్వారా తన అల్లుడు నరేష్‌పై నిఘా పెట్టించాడు. ఆరు నెలల నుంచి నిఘా పెట్టగా.. తన అల్లుడు నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కూడా కన్నాడని తెలిసింది. సురేష్ ప్రోత్సాహంతోనే నరేష్ ఇదంతా చేశాడని నమ్మిన వెంకటయ్య, అతడి కుమార్తె ఉమామహేశ్వరి సురేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన కిరణ్‌కుమార్‌కు చెప్పగా.. తాను గతంలో నేవీలో కమ్యూనికేషన్ వింగ్‌లో పనిచేశానని, ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయాలో తనకు బాగా తెలుసని, రూ.15 లక్షలు ఇస్తే హత్య చేస్తానని కిరణ్‌కుమార్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఈ క్రమంలో కిరణ్‌కుమార్ నెల క్రితం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన తన బంధువు ముశం జగదీశ్‌కు విషయం చెప్పి, రూ.3 లక్షలు పారితోషికం ఇస్తానని ఆశచూపి ఈ హత్యలో భాగస్వామి కావాలని కోరాడు. దీంతో జగదీశ్ ఒప్పుకున్నాడు. వీరిద్దరు కలిసి నెల రోజుల నుంచి నల్లగొండ పట్టణంలో రెక్కీ నిర్వహిస్తూ గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో మణికంఠ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ కదలికలను కనిపెడుతూ వచ్చారు.
హత్య జరిగింది ఇలా..
నెల రోజులు రెక్కీఅనంతరం ఈ నెల 11న చిక్కు కిరణ్‌కుమార్ హైదరాబాద్ నుంచి జెన్ కారులో చెర్వుగట్టు వరకు వచ్చాడు. హత్య చేయడానికి కావల్సిన కత్తులు, మాస్కులు, టోపీలు, గ్లౌజ్‌లను వెంట తెచ్చుకున్నాడు. కారు చెర్వుగట్టు వద్ద పెట్టిన కిరణ్‌కుమార్ అప్పటికే అక్కడ వేచి ఉన్న ముశం జగదీశ్‌తో కలిసి బైక్‌పై చర్లపల్లి వరకు వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో రాత్రి 10 గంటలకు రామగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి గీతాంజలి అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని పథకం ప్రకారం మృతుడి షాపు వెనకాల అప్పటికే ఉంచిన బైక్ తీసుకుని 10.45గంటలకు కలర్ ల్యాబ్ వద్దకు వచ్చారు. తమకు ఫొటోలు, ప్రింట్లు కావాలని సురేష్‌ను అడగ్గా.. రాత్రయింది రేపు ఉదయం రమ్మని సురేష్ వారికి చెప్పాడు. అర్జెంటుగా కావాలని అడగడంతో ఫొటోలు ప్రింట్ ఇచ్చే పనిలో సురేష్ నిమగ్నమవ్వగా.. అదే అదునుగా భావించిన కిరణ్‌కుమార్, జగదీశ్ కత్తులతో సురేష్ గొంతు కోసి వీపు, పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం బైక్‌పై చర్లపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి మరో బైక్‌పై చెర్వుగట్టుకు వెళ్లి అక్కడ రక్తం అంటిన దుస్తులు, కత్తులు అన్నీ కారులో పెట్టుకుని అమ్మనబోలు వైపు వెళ్లిపోయారు. మార్గమధ్యలో మూసీ వాగులో రక్తం అంటిన దుస్తులు, కత్తులను పడేసి హైదరాబాద్ పారిపోయారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. బుధవారం హత్యకు పథకం వేసిన నరేష్ మామ మాతరి వెంకటయ్య(ఏ1 ), అతడి కూతురు, నరేష్ భార్య గద్దపాటి ఉమామహేశ్వరి(ఏ4)ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. చిక్కు కిరణ్‌కుమార్(ఏ2 ), ముశం జగదీశ్(ఏ3 )ను నార్కట్‌పల్లిలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి మారుతీ జెన్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు ఛేదించిన డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులును ఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుని తదుపరి విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఫ తన కుమార్తె సంసారం నాశనం చేశాడనే కక్షతో గద్దపాటి సురేష్‌ను హత్య
చేయించిన అతడి తమ్ముడి మామ
ఫ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ
ఎస్పీ శరత్‌చంద్ర పవార్

తమ్ముడి మామే సూత్రధారి

తమ్ముడి మామే సూత్రధారి