
బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం
మునుగోడు: ఆరేళ్ల చిన్నారి ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని తహసీల్దార్ నరేందర్ భరోసా ఇచ్చారు. మునుగోడు మండలంలోని కల్వ లపల్లి గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్– అనిత దంపతుల పెద్ద కుమారై ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ కుటుంబ ధీనగాధని గురువారం సాక్షి దినపత్రికలో ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్ శీర్షికన కథనం ప్రచురించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి కుటుంబ పరిస్థితి పరిశీలించి నివేదిక అందించాలని మునుగోడు తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈమేరకు ప్రసన్న ఇంటికి వెళ్లి ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితులపై తహసీల్దార్ ఆరా తీశారు. అయితే కుటుంబానికి రేషన్ కార్డు లేకపోవడంతో ఎక్కడా ఉచిత వైద్యసేవలు అందడంలేదని కథనంలో ప్రచురించగా ఆ కుటుంబానికి నూతన రేషన్ కార్డు మంజూరుచేస్తామని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తాము రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నామని, మంజూరైతే తమ కుమారైకు ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల ద్వారా ఉచిత వైద్యసేవలు అందుతాయని పేర్కొంటున్నారు.
బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రసన్నను పరామర్శించిన తహసీల్దార్

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం