
పశువుల ఎరువుతో భూసారం పెంపు
ఇలా దుక్కి దున్నాలి
దుక్కిని ఎలా పడితే అలా దున్నడం వల్ల సాగు చేసే పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు వేసవిలో మెట్ట భూములను వానాకాలం సీజన్ కోసం సన్నద్ధం చేస్తుంటారు. వేసవిలో వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి నీటి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది. దీంతో మెట్ట ప్రాంతాల్లో భూమి వాలుకు అడ్డంగా దుక్కి చేయాలి. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.
పెద్దవూర: ప్రస్తుతం రైతులు అధిక శాతం రసాయన ఎరువుల ద్వారానే పంటలు సాగు చేస్తున్నారు. దీంతో నేలలోని పోషకాల నిల్వల్లో సమతుల్యం లోపించి ఉత్పాదక శక్తి తగ్గుతుంది. చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాల లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే సేంద్రియ పద్ధతులు పాటించాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ సూచిస్తున్నారు.
సేంద్రియ ఎరువులతో..
పశువులు, మేకలు, గొర్రెల పేడ పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పశువుల పేడ నేల సారవంతం చేయడంలో సహాయ పడుతుంది. ఇది నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉంటుంది. ఇవి మొక్కల పెరుగుదలకు అవసరం. ఇది సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట భూముల్లో వేసి దున్నితే చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతోంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువుల పేడ ఉపయోగపడుతుంది. ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల పెంటను వినియోగించాలి.
భూసారం పదిలం
సాధారణంగా రైతులు వేసవిలో పశుశుల ఎరువును వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఎండల కారణంగా పొలంలో వెదజల్లితే వాటిలోని పోషకాలు ఆవిరవుతాయి. పశువుల పెంటను పొలంలో కుప్పలుగా పోసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమి గుల్ల బారడానికి తోడ్పడుతుంది. సహజ సిద్ధమైన లవణాలు అందుతాయి. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపు చేసి మొక్కలకు అందేవిధంగా సహాయపడతాయి. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చు.

పశువుల ఎరువుతో భూసారం పెంపు