
కోతకు గురైన రహదారికి మరమ్మతులు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలంలో కోతకు గురైన 365వ నంబర్ జాతీయ రహదారి అంచులను సంబంధిత అధికారులు మట్టితో పూడ్చివేయించారు. ‘పగుళ్లతో ప్రమాదకరంగా 365వ నంబర్ హైవే’ అనే శీర్షికన ఈ నెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించి అంచులు కోతకు గురైన చోట మట్టిపోసి పూడ్చే పనులు చేపట్టారు. సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేసిన ‘సాక్షి’కి వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
మందుబాబులకు
జైలు శిక్ష, జరిమానా
సూర్యాపేటటౌన్: సూర్యాపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13మందిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్షతో పాటు రూ.2వేల చొప్పున జరిమానా, మరో తొమ్మిది మందికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ తీర్పు వెలువరించినట్లు పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలిపారు. మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు
చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తోంది. ఏపీకి చెందిన మరో ఆర్టీసీ బస్సుకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులోకి రాగానే అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో బస్సు డ్రైవర్ నక్క శ్రీనివాస్ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండానే ఒక్కసారిగా బస్సును రోడ్డు కిందికి దింపాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సత్తుపల్లి డిపో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు మేఘన, సాయిప్రియాంక, మోహన్‌రావుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సత్తుపల్లి డిపో బస్సు డ్రైవర్ నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు.

కోతకు గురైన రహదారికి మరమ్మతులు