
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ హరిబాబు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసిన గువ్వల శ్రీనివాస్‌కు స్థానికంగా బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్ పడింది. గువ్వల శ్రీనివాస్‌కు బదులుగా అప్పాముల శ్రీనివాస్ అనే మరో విద్యార్థి గురువారం సాంఘిక శాస్త్రం పరీక్ష రాస్తుండగా.. విషయం తెలుసుకున్న ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సబ్ కలెక్టర్ తహసీల్దార్ హరిబాబు, ఎంఈఓ బాలునాయక్‌ను పరీక్షా కేంద్రానికి పంపి తనిఖీ చేయాలని ఆదేశించారు. రూం నంబర్ 8లో 166 రూల్ నంబర్‌తో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, కోర్డినేటర్లపై విచారణ చేసి నివేదికను డీఈఓకు పంపుతామని ఎంఈఓ బాలునాయక్ తెలిపారు. కాగా గురువారం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాలను డీఈఓ భిక్షపతి తనిఖీ చేశారు. ఈ ఘటనపై విలేకరులు డీఈఓను ప్రశ్నించగా.. ఓపెన్ పరీక్షలు ఓపెన్‌గానే జరుగుతాయని సమాధానం చెప్పడం గమనార్హం.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌కు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధర్మానాయక్, సెంటిమేరీ పాఠశాలలో దశరథ్‌నాయక్, బకల్‌వాడ పాఠశాలలో రాజు, బాలికల ఉన్నత పాఠశాలలో బాలునాయక్ పరీక్షల్లో కాపీ చేయించేందుకు గాను విద్యార్థుల నుంచి రూ.2500 నుంచి రూ.4వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాసేందుకు గాను రూ.5వేల నుంచి రూ.8వేలు వసూలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
ఫ మిర్యాలగూడ బాలికల
జెడ్పీహెచ్‌ఎస్‌లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న విద్యార్థులు
ఫ సబ్ కలెక్టర్ ఆదేశాలతో
తహసీల్దార్ తనిఖీ
ఫ ఇద్దరిపై కేసు నమోదు