
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎలుకల నివారణ చర్యలు
ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండా రోజూ శుభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్ మెష్ మూతలు అమర్చాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు.
పెద్దవూర: యాసంగి వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఎలా భద్రపర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసి పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకోవడం రైతులకు సవాలుగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుంచి 20 శాతం నష్టపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్. ధాన్యం నిల్వ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
ధాన్యం నూర్పిన తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. సాధారణంగా వరికోతల సమయంలో ధాన్యంలో 20శాతం తేమ ఉంటుంది. గతంలో కూలీలచే వరి కోతలు కోపించేవారు. కూలీల కొరత ఒకవైపు, అకాల వర్షాల భయంతో పంట చేతికి వచ్చేదాకా రైతులకు భరోసా లేకుండా పోతుంది. కూలీలచే వరి పంటను కోసిన తర్వాత వరి పసలను ఆరబెట్టడం వల్ల 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతానికి తేమ ఉంటే బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం రైతులు వరికోత యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పంట పచ్చగా ఉన్నప్పుడే వరి కోతలు కోస్తున్నారు. దీంతో ధాన్యంలో మరింత తేమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగచేస్తాయి. అంతేకాక ఎలుకలు ధాన్యాన్ని తినడమేకాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాలు
ఫ ముక్క పురుగు : పంట కోయడానికి ముందు నుంచి ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుంచి వెలువడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది.
ఫ వడ్ల చిలుక: ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే ధాన్యం చెడువాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తరువాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది.
ఫ నుసి పురుగు: దీనినే పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నదిగా 3 మి.మీ పొడవు ఉంటుంది. ప్రౌఢ కీడకం ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజ పైపొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది.
ధాన్యం నిల్వ చేసే పద్ధతి
రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల్లో నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షం నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచుల పైన, లోపల మలాథియాన్ లేదా ఎండో సల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో ఆరబెట్టాలి.

ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు