
బోరు మోటార్ల చోరీ నిందితుల అరెస్ట్
నార్కట్‌పల్లి : వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం డీఎస్పీ శివరాంరెడ్డి నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 9న రాత్రి సమయంలో షాపల్లి గ్రామంలోని కన్నెబోయిన శ్రీను వ్యవసాయ బోరు మోటారు చోరీకి గురైంది. ఈమేరకు బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మాగి నాగరాజుపై అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం పక్క సమాచారంతో మండల కేంద్రంలోని అమ్మనబోలు రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై అనుమానాస్పదంగా ఉన్న నలుగురిలో మాగి నాగరాజు ఉండడంతో అతడిని పట్టుకుని విచారించారు. గత రెండు సంవత్సరాల నుంచి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి షాపల్లి, తొండల్‌వాయి, నక్కలపల్లి, కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, నారెగూడెం, వివిధ గ్రామాల్లో వ్యవసాయ భూముల వద్ద బోరుమోటార్లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో వారిని విచారించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.9.60 లక్షల విలువైన 24 బోరు మోటార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నార్కట్‌పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన మాగి నాగరాజు (ఎ–1), సుద్దాల నర్సింహ(ఎ–2), బకరం శేఖర్(ఎ–3), బాషపాక సైదులు(ఎ–4), నల్లమాద లింగయ్య(ఎ–5), బాషపాక లింగయ్య(ఎ–6)గా ఉన్నారని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరంతా ఉదయం ఎక్కడెక్కడ బోరు మోటార్లు ఉన్నాయని రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
డిండి: మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శుక్రవారం డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ప్రహరీ వద్ద ఉన్న చెట్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని పీహెచ్‌సీ సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు దాదాపు 50 సంవత్సరాల వరకు ఉంటుందని, గోధుమ రంగు షర్ట్, బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. తెలిసిన వారు 8712675544, 8712670223 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఫ 24 బోరు మోటార్లు, రెండు బైక్‌లు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి

బోరు మోటార్ల చోరీ నిందితుల అరెస్ట్