రైతులకు సోలార్‌ ప్లాంట్లు | - | Sakshi
Sakshi News home page

రైతులకు సోలార్‌ ప్లాంట్లు

Published Mon, Apr 28 2025 1:40 AM | Last Updated on Mon, Apr 28 2025 1:40 AM

రైతుల

రైతులకు సోలార్‌ ప్లాంట్లు

పీఎం–కుసుమ్‌ పథకం కింద యూనిట్ల స్థాపన

హుజూర్‌నగర్‌ : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా పీఎం–కుసుమ్‌ (ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్‌కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది.

ఉమ్మడి జిల్లా నుంచి 874 మంది రైతులు

సౌర విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 874 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 192 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. కాగా వారిలో 123 మందికి టీఎస్‌ రెడ్‌కో అధికారులు ఎల్‌ఓ (లెటర్‌ ఆఫ్‌ అవార్డు) అందజేశారు.

దీర్ఘకాలిక ఆదాయ వనరు

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ను రూ.3.15 చొప్పున విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిస్కంలతో ఒప్పందం 25ఏళ్ల పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు తమ సాగు యోగ్యంకాని భూముల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు.

సబ్‌స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరం..

వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్‌కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్‌ ఉపకేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది. మూడున్నర ఎకరాల పట్టా భూమి, లేదా పోడుభూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన అర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు.

ఫ కర్షకుల ఆదాయం పెంచేలా ప్రభుత్వ ప్రణాళిక

ఫ మూడున్నర ఎకరాల పట్టా భూమి ఉన్న రైతులు అర్హులు

ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 మంది దరఖాస్తు

ఫ ఈఎండీ చెల్లింపునకు నెలాఖరు వరకు గడువు

జిల్లా అర్జీలు ఈఎండీ ఎల్‌ఓ

చెల్లింపులు ఇచ్చింది

నల్లగొండ 365 91 68 సూర్యాపేట 285 43 24

యాదాద్రి 224 58 31

రైతులకు సోలార్‌ ప్లాంట్లు1
1/1

రైతులకు సోలార్‌ ప్లాంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement