సాక్షి ప్రతినిధి, కడప : పేరుకు కాషాయ కండువా కప్పుకున్నా.. మనసు మాత్రం పచ్చ పార్టీ గురించే ఆలోచిస్తుంది. చంద్రబాబుకు జై కొట్టే అతి కొద్దిమంది బీజేపీ నేతల్లో ముందు వరుసలో మాజీ ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తరించాలనే ఉద్దేశం కంటే టీడీపీ బలపడాలనే లక్ష్యం ఆయనలో బలంగా దాగి ఉంది. అందుకు అనుగుణంగానే రాజకీయ సమాలోచనలు ఉంటున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తాజాగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పొత్తులపై ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఒకవైపు తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, టీడీపీతో కలిసి వెళ్లేది లేదని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. బీజేపీలోని చంద్రబాబు వర్గం నేతలు మాత్రం టీడీపీతో కలవడానికి అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అడపాదడపా అదే విషయాన్ని తెరపైకి తెస్తూ తెలుగుదేశం పార్టీని రక్షించేందుకు తెరవెనుక సంకల్పం పుచ్చుకున్నారు. అలాంటి వారిలో జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముందు వరుసలో నిలుస్తున్నారు. నిత్యం బీజేపీ భజన కంటే చంద్రబాబు భజనే పరిపాటిగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పటిష్టత ఎలా ఉన్నా, టీడీపీ బలపడాలనే తపన మెండుగా ఉండడమే అందుకు ప్రధాన కారణంగా రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
కొరవడిన చిత్తశుద్ధి!
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైంది. టీడీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి సైతం భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సైతం అదేబాట పట్టారు. అందుకు ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడమే. అధికారం లేకపోతే రాజకీయ మనుగడ కష్టసాధ్యమనే భావనే వారిని బీజేపీలో చేరేలా చేసింది. వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే క్రమంలో కుటుంబం యావత్తు ఆ పార్టీలో చేరారు. కాగా బీజేపీలో కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే చేరి, కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో అలాగే కొనసాగేలా జాగ్రత్త పడ్డారు. ఇదే వైఖరిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా అవలంబించారు. ఎంపీగా బీజేపీ జాతీయ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూనే కుటుంబాన్ని టీడీపీలో కొనసాగిస్తున్నారు. బీజేపీ పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా నిలుస్తోంది.
రాబోవు రోజుల్లో మరింత వివాదాస్పదం..
భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ పాళ్లు అధికం. అరువు తెచ్చుకున్న నాయకుల కారణంగా ఆ పార్టీలో కూడా క్రమశిక్షణ లోపించింది. ఎన్నికల గడువు సమీపించే కొద్ది బీజేపీ నేతల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు అధికం కానున్నాయి. అదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే భావించాల్సి వస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే ఆది సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి కొనసాగుతున్నారు.
టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ కుటుంబాన్ని అలాగే కొనసాగించి, ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కేటాయించాలని తెరవెనుక మంత్రాంగాన్ని మాజీ ఎమ్మెల్యే ఆది నడుపుతున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం తమ స్వగ్రామం దేవగుడికి సమీపంలోనే ఉండడం, ప్రొద్దుటూరు పట్టణం, రూరల్, రాజుపాళెం మండలాలు మాతమ్రే విస్తరించి ఉండడం, పలువురితో ప్రత్యక్ష సంబంధాల దృష్ట్యా ఆ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకే బీజేపీ నాయకత్వంతో నిమిత్తం లేకుండా వివాదాస్పద నిర్ణయాలు, అభిప్రాయాలు తెరపైకి తెస్తున్నారు. రాబోవు రోజుల్లో మరింతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, కుదిరితే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు.. లేదంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే ఆదినారాయణరెడ్డి అసలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment