సాక్షి ప్రతినిధి, కడప : ప్రజల సంక్షేమం, సమాజ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శనివారం జిల్లా వాసులు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే అన్నదాతలకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన డాక్టర్ వైఎస్సార్ రైతులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల వారి అభ్యున్నతికి అహర్నిశలు పనిచేశారు. రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మి వ్యవసాయరంగం అభివృద్ధికి చర్యలు చేపట్టారు.2004లో ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని పరుగులు పెట్టించారు.
మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్యవిద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆస్పత్రి, దంత వైద్యకళాశాల నిర్మించారు. ట్రిపుల్ ఐటీ, ఐజీ కార్ల్ (పశు పరిశోధన కేంద్రం), దాల్మియా సిమెంటు కర్మాగారం, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్, భారతి సిమెంటు కర్మాగారం, సజ్జల పాలిమర్స్ లాంటి పరిశ్రమలను నెలకొల్పారు. సుమారు రూ.12 వేల కోట్లతో జలయజ్ఞంలో భాగంగా గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరద కాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్సార్ హయాంలో రూపొందించినవే.
మైలవరం ఆధునికీకరణ, సర్వరాయసాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, పైడిపాళెం, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే తెలుగుగంగ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలతో బ్రహ్మంసాగర్‌ను నింపి ఆయకట్టుకు ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ చేతుల మీదుగా నీటిని విడుదల చేయించారు. జిల్లాలో విశాలమైన రోడ్లు వేయించారు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా పనిచేసిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో అభివృద్ది పథకాలతోపాటు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేశారు.
నేడు జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు
శనివారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీలకతీతంతగా సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ఘాట్‌లో దివంగత నేతకు నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు, వివిధ ఆస్పత్రులల్లో రోగులకు సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
తండ్రి బాటలో తనయుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ అదేబాటలో పయనిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని ప్రకటించి, తూచ తప్పకుండా నాలుగేళ్లుగా నాలుగు అడుగులు ముందుకు వేశారు. బీడు భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడే రైతులకు విత్తనాలు, ఎరువులు, పనిముట్లను అందజేస్తున్నారు. వ్యవసాయ పరమైన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రైతుల ముంగిట్లోకి తెచ్చారు.
రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ద్వారా జిల్లాలో 2019–20లో 2,06,708 మంది రైతులకు రూ.279.93 కోట్లు, 2020–21లో 2,08,747 మందికి రూ.280 కోట్లు,2021–22లో 1,99,344 మందికి రూ.269.11 కోట్లు అందించారు. అలాగే 2022–23 ఏడాదిలో 1,90,074 మంది రైతులకు రూ.192.96 కోట్లు మొత్తంగా జిల్లాలోని రైతులకు రూ.1,022 కోట్లు అందజేశారు. భూములు లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు సైతం ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ రైతులను ఆదుకునేందుకు డాక్టర్ వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తున్నారు.
బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలోని 3,80,475 మంది రైతులకు రూ.1,063.22 కోట్లు బీమా వర్తించింది. జిల్లాలో ఖరీఫ్, రబీలలో కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు స్థానికంగానే అందిస్తున్నారు. రైతులకు అవసరమైన అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ రైతు రాజ్యాన్ని నెలకొల్పారు.
రైతులతోపాటు అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. మరోవైపు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తద్వారా నిరుద్యోగ చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. మొత్తంగా రాజన్న రాజ్యాన్ని మరిపించే రీతిలో సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment