కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పీఎస్ పరిధిలో సాయినగర్‌లో నివాసముంటున్న గురునాథ్‌సింగ్ (45) అనే వ్యక్తి బుధవారం ఆత్మతహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై అతనితో పాటు ఇంటిలో ఉంటున్న సుబ్రమణ్యం, నదీంఖాన్‌లను పోలీసులు విచారించారు. సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు రిమ్స్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేశారు. గురునాథ్‌సింగ్ ఆత్మహత్యకు ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఫర్బానీజిల్లా కార్గోని రోడ్‌లో నివాసం ఉంటున్న సుబ్రమణ్యం, నదీంఖాన్, గురునాథ్‌సింగ్‌లు స్నేహితులు.
కడపలోని సాయినగర్‌లో రవీంద్ర అనే వ్యక్తి ఇంటిలో నివాసం ఉంటున్నారు. రవీంద్ర ఇచ్చిన సూచనల మేరకు తమ స్నేహితులతోనేగాక, కడపలోని ప్రజల నుంచి డబ్బులను సేకరించి డీఎఫ్‌టీ (దుబాయ్ ఫీచర్ టెక్నాలజీ) కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. వీరు ముగ్గురు రవీంద్ర దగ్గరనే దాదాపు కోటిరూపాయల మేరకు పెట్టుబడులుగా పెట్టించారు. రవీంద్ర కూడా తన స్నేహితుల దగ్గరి నుంచి పెట్టుబడులను పెట్టించారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ఆ సంస్థకు సంబంధించిన వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడం, వీరిపై ఒత్తిడి పెరగడంతో గురునాథ్‌సింగ్ మానసిక వేదనకు గురయ్యాడు. సుబ్రమణ్యం, నదీంఖాన్‌లు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి వచ్చి అదే ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో తెల్లవారుజామున గురునాథ్ సింగ్ బాత్‌రూంలోకి వెళ్లి కిటికీకి ప్యాంటుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉదయం 7:30 గంటల సమయంలో లేచిన సుబ్రమణ్యం, నదీంఖాన్‌లు బాత్‌రూంకు వెళ్లిన గురునాథ్‌సింగ్ ఎంతసేపటికి రాకపోగా, పిలిచినా పలుకకపోవడంతో బాత్ రూం తలుపును బలవంతంగా తీశారు. కిటికీకి ఉరి వేసుకుని వేలాడుతుండటంతో రిమ్స్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందాడని రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తరువాత పోస్టుమార్టం నిర్వహిస్తామని, పూర్తి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment