Rayachoty: ఔను ఆయనకు టికెట్‌ లేదు ! | - | Sakshi
Sakshi News home page

Rayachoty: ఔను ఆయనకు టికెట్‌ లేదు !

Published Tue, Feb 20 2024 12:02 AM | Last Updated on Tue, Feb 20 2024 12:38 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : రాయచోటి టీడీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పార్టీ వీడనున్నారా..? కుటుంబ సభ్యుడే అన్యాయానికి ఒడిగట్టారని విశ్వసిస్తు న్నారా.. చంద్రబాబు నియంతృత్వ, ఏకపక్ష ధోరణిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రగిలిపోతున్నారా? అని ప్రశ్నిస్తే విశ్లేషకులు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే రమేష్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి కన్పి స్తోంది. సోమవారం లక్కిరెడ్డిపల్లె కేంద్రంగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టికెట్‌ లేదంటూ తేల్చి చెప్పిన అధిష్టానంపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచర ప్రకటించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఇరువైఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్నాం, నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చిత్తశుదిత్ధో చేపట్టాం. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం టికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎవరి విజయం కోసం పనిచేయాలని చెబుతోంది. ఇక పార్టీలో ఉండలేం, మనదారి మనం చూసుకోవాలని సన్నిహితులతో మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రీజనల్‌ ఇన్‌చార్జి దీపక్‌రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. ఈమారు ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

అందుకు ప్రత్యామ్నాయంగా మీకేమి పదవి కావాలో చెప్పండి, అధినేత చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం మినహా మరే పదవి వద్దని రమేష్‌ కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. ఒక్కసారి అధినేత చంద్రబాబుతో మాట్లాడించండి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినా నిష్ప్రయోజనమే అయినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం మండలాల వారీగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత లక్కిరెడ్డిపల్లె మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన రమేష్‌ నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టలేదని వివరిస్తూనే, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు.

సోదరుడు శ్రీనివాసులరెడ్డిపై గుర్రు..
చంద్రబాబు టికెట్‌ నిరాకరణకు సోదరుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కారకుడని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి టికెట్‌ మా అన్నకు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయలేనంటూ టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పలేదనే ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తల ఊపి వచ్చాడని, ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ మేరకే శ్రీనివాసులరెడ్డి మౌనం వహించారని తెలుస్తోంది. కుటుంబం, సోదరుడు కంటే శ్రీనివాసులరెడ్డికి పదవే ముఖ్యమైందా? ఇక తనతో కూడా తెగదెంపులు చేసుకోవాలనే దిశగా రమేష్‌ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రెడ్డెప్పగారి కుటుంబ సభ్యులు, బంధువులంతా మాజీ ఎమ్మెల్యే రమేష్‌ నిర్ణయానికే అనుగుణంగా నిలిచేందుకు సంసిద్ధులైనట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఫొటో ఎత్తేశారు
సోమవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ కేడర్‌తో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో లేకుండా ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు, తన తండ్రి మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో వాడుకున్నారు. ఎక్కడ కూడా టీడీపీ జెండా ఏర్పాటు చేయలేదు. పైగా తన సోదరుడు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో లేదు. ఇవన్నీ రమేష్‌కుమార్‌రెడ్డి టీడీపీ వీడేందుకు చిహ్నాలుగా స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆరు మండలాలకు చెందిన కేడర్‌తో సమావేశం పూర్తయిన తర్వాత టికెట్‌ విషయమై బహిర్గత పర్చనున్నట్లు సమాచారం. ఇరువై ఏళ్లుగా మీకు తోడు నీడగా ఉంటున్నా, ఇప్పుడేమి చేయాలో మీరే చెప్పాలని కార్యకర్తల అభిప్రాయాలు కోరనున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే వారందరీతో టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేయాలనే ఆలోచన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement