దళితులపై దాష్టీకం
● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే
టార్గెట్‌గా కక్షసాధింపు
● ముగ్గురికి సంబంధించిన
గృహాల కూల్చివేత
● బాధితులను పరామర్శించిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి
రాజంపేట రూరల్ : కూటమి నాయకుల దాష్టీకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దళితుల గృహాలు కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. వివరాలు.. రాజంపేట మండల పరిధిలోని కూచివారిపల్లి పంచాయతీ కొమ్మివారిపల్లి దళితవాడలో వైఎస్సార్‌సీపీకి చెందిన గొంటు సుబ్బమ్మ, మద్దూరి సుబ్బలక్ష్మి, గొంటు ఈశ్వరమ్మలు ప్రభుత్వం అందజేసిన భూమిలో గృహాలను నిర్మించుకున్నారు.జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలతో సబ్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, తహసీల్దార్ పీర్‌మున్నీ, మన్నూరు సీఐ మహమ్మద్ అలీ దగ్గరుండి గృహాల కూల్చి వేతకు బుధవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. పోలీసు బలగాలు, జేసీబీలతో రెవెన్యూ అధికారులు దళితవాడ వద్దకు వచ్చారు. తమ వద్ద ఉన్న పట్టాలను దళితులు చూపించినా కనికరం చూపలేదు. నోటీసులు ఇవ్వకుండా వచ్చారు కదా సమయం ఇవ్వండి అని వేడుకున్నా కరుణించలేదు. పేదలం.. గృహాలను కూల్చవద్దని ప్రాధేయ పడినా వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల పహారాలో బుధవారం రాత్రి 10గంటల వరకు కూల్చివేతలను కొనసాగించారు. ప్రభుత్వ భూమి అని చెబుతున్నా రెవెన్యూ అధికారులు దళితుల గృహాల పక్కనే ఉన్న కూటమి ప్రభుత్వానికి చెందిన వారి గృహాల వైపు కన్నెత్తి కూడా చూడక పోవటం గమనార్హం.
దళితుల గృహాలను కూల్చివేయటం దుర్మార్గపు చర్య : ఆకేపాటి
2 సంవత్సరాల కిందట దళితులు నిర్మించుకున్న గృహాలను అధికార యంత్రాంగం దౌర్జన్యంగా కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మండి పడ్డారు. కొమ్మివారిపల్లి దళితవాడలో బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేసిన దళితుల గృహాలను గురువారం ఎమ్మెల్యే ఆకేపాటి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఆకేపాటి రాగానే దళితులు పెద్ద ఎత్తున రోదిస్తూ తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. రెక్కాడితే కానీ డొక్కాడని దళితులమైన మేము అగ్రకులాల వారి మధ్య గృహాలను నిర్మించుకున్నందున కుల వివక్షతో కూల్చేశారని బోరున విలపించారు. కూల్చవద్దని ప్రాధేయ పడుతున్నా వినలేదని, మహళలు అని చూడకుండా మా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారంటూ విలపించారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు జిల్లా అభివృద్ధికి దోహదపడాలి కానీ కూల్చివేతలకు ఆదేశాలివ్వడం తగదన్నారు. అధికారులు పక్ష పాత ధోరణి విడనాడాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో గృహాలను కూల్చివేయాల్సిన అవసరం అధికారులకు ఏముందని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సమస్యలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఎపుడూ లేని విష సంస్కృతికి బీజం వేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించటం సరి కాదన్నారు. దళితులకు నష్ట పరిహారం చెల్లించి, గృహాలను నిర్మించే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. దళితులను ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నరు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఏబీ సుదర్శన్‌రెడ్డి, మూరి గోవర్ధన్‌రెడ్డి, పాటూరు భరత్‌కుమార్‌రెడ్డి, అనుదీప్, వైఎస్సార్‌సీపీ నాయకులు పీ.విశ్వనాథరెడ్డి, కే. గోపిరెడ్డి, జేవీ కృష్ణారావు, జీ. త్రినాథ్, డి. బాస్కర్‌రాజు, శంకరయ్యనాయుడు, ఏ.సౌమిత్రి, ఎస్.నవీన్‌కుమార్, ఏ. వరదరాజు, దండు గోపీ, దాసరి పెంచలయ్య, జీవీ సుబ్బరాజు, ఆర్.కమలాకర్, ఆర్.గురుమూర్తి, ఏ.మధుబాబు, కె.రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాష్టీకం
Comments
Please login to add a commentAdd a comment