చెరువు మట్టిని తరలిస్తే తీవ్రంగా నష్టపోతాం
వేముల : చెరువులో మట్టిని తరలిస్తే తీవ్రంగా నష్టపోతామని బాధిత రైతులు శుక్రవారం టిప్పర్లను అడ్డుకుని నిరసనకు దిగారు. గత నెల రోజులుగా వేములకు సమీపంలో ఉన్న చెరువులో మట్టిని రోడ్డు పనులకు తరలిస్తున్నారు. చెరువులో మట్టిని తరలించడంతో మరము బయట పడింది. దీంతో చెరువు కింద భాగంలో ఉన్న బాధిత రైతులు శుక్రవారం చెరువు వద్దకు చేరుకుని మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. నెల రోజులుగా రోడ్డు పనులకు చెరువు మట్టిని తోలడంతో మరము బయట పడిందన్నారు. చెరువుకు నీరు చేరితే మరములో నీరు ఇంకి కింద భాగంలో ఉన్న పొలాలపై నీరు ఊటలెత్తుతుందని, మట్టిని తరలించొద్దని ప్రొక్లెయిన్లను, టిప్పర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఇప్పటికే చెరువులో నీరు ఉంటే కింద భాగంలో నీరు ఊటలెత్తి పొలాలపై పారడంతో పంటలు పండక నష్టపోతున్నామని వాపోతున్నారు. చెరువులో మట్టిని తోలుకునేందుకు అనుమతులు ఉంటే చూపించాలని బాధిత రైతులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని బాధిత రైతులను, రోడ్డు నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత రైతులు చెరువులో మట్టి తోలితే ఎదురయ్యే నష్టాలను, ఇబ్బందులను సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌లకు వివరించారు. ఇప్పటికే చెరువు కింద ఊటలెత్తి పంటలు పండటం లేదని, మట్టిని తోలితే పూర్తిగా భూములను వదులుకోవాల్సి వస్తుందని విజ్ఞప్తి చేశారు. దీంతో చెరువులో మట్టిని తోలుకునేందుకు అనుమతులు చూపించాలని రోడ్డు నిర్వాహకులకు సూచించారు. అలాగే ఇరిగేషన్ అధికారులతో పోలీసులు చెరువులో మట్టిని తోలుకునేందుకు ఏవైనా అనుమతులు ఇచ్చారనే విషయంపై మాట్లాడారు. దీనికి ఇరిగేషన్ అధికారులు మట్టిని తోలుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు చెరువులో మట్టిని అనుమతులు తీసుకున్న తర్వాతనే తోలుకోవాలని, అంతవరకు నిలిపివేయాలని రోడ్డు నిర్వాహకులకు సూచించారు.
మరోసారి టిప్పర్లను అడ్డుకున్న బాధిత రైతులు
Comments
Please login to add a commentAdd a comment