రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా
ప్రొద్దుటూరు : మిర్చి రైతుల సమస్యలపై ప్రశ్నించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కేసులు పెట్టడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శిపవ్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌తోపాటు మిర్చి యార్డుకు వెళ్లిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సంఘటన స్థలంలోలేని మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయన శుక్రవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సూపర్ 6 అమలు చేయలేదని, మెగా డీఎస్సీ అమలు కాలేదని, రైతులకు మద్దతు ధర లభించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం సిగ్గుపడాల్సిందిపోయి ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడం తగునా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం మాత్రం అన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ప్రకటించని 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, తద్వారా రూ.65వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, ఇంటి గ్రేటెడ్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా పరీక్షలు చేయడం, ఉచిత పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, ఈ క్రాప్ విధానం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 ఇచ్చేవారన్నారు. ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత జగన్‌దేనన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వీటన్నింటిని గాలికి వదిలేసిందన్నారు. చంద్రబాబు రైతులకు పెట్టుడి సాయం కింద రూ.20వేలు ఇస్తానని చెప్పి ఇంత వరకు 20 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో క్వింటాలు మిర్చి ధర రూ.24వేలు ఉండగా, ప్రస్తుతం రూ.10వేలకు పడిపోయిందన్నారు. ప్రతి ఎకరానికి మిర్చి రైతు రూ.లక్ష నష్టపోయారని తెలిపారు. ఈ కారణంగానే జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారని చెప్పారు.
మా నాయకుడు కేసులకు భయపడడు
తమ అధినాయకుడు జగన్ కేసులకు భయడపడుతాడు అనుకోవడం టీడీపీ నాయకుల అవివేకమని రాచమల్లు అన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలసి రావాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ జేష్టాది శారద, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు గుర్రం లావణ్య, పాతకోట మునివంశీధర్‌రెడ్డి, నూకా నాగేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుద్దేటి రాజారాంరెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ దేసు రామ్మోహన్‌రెడ్డి, చేనేత విభాగం కన్వీనర్ చౌడం రవిచంద్ర పాల్గొన్నారు.
ప్రభుత్వం మెడలు వంచేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలి
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
శివప్రసాదరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment