గ్రూప్–2లో రోస్టర్ విధానం సవరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఈనెల 23వ తేదీన నిర్వహించే గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల్లో రోస్టర్ విధానాన్ని సరిచేయాలని కోరుతూ అభ్యర్థులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత గ్రూప్–2లో 899 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే రోస్టర్ పాయింట్స్‌లో తప్పులు ఉండడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షల కోసం 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అయితే రోస్టర్‌లో తప్పుల వల్ల పరీక్షలు జరుగుతాయా? లేదా అన్న అనుమానం అభ్యర్థుల్లో గందరగోళానికి తావిస్తోందన్నారు. రోస్టర్‌పాయింట్‌లో చోటుచేసుకున్న తప్పులను సవరిస్తే తప్ప అభ్యర్థులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. రోస్టర్ విధానంలో తప్పుల వల్ల గతంలో కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గ్రూప్–2 అభ్యర్థులు గుర్తు చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ రద్దుచేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉంచిందన్నారు. కార్యక్రమంలో ఏపీపీఎస్‌సీ అభ్యర్థులు సుమన్, ఆర్‌సీ రెడ్డి, శ్రీనాథరెడ్డి, పూర్ణచంద్ర, చక్రి, రసూల్‌బాష, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి విజయ్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు.
కలెక్టరేట్ ఎదుట అభ్యర్థుల ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment