కూటమికి ఓట్లేసి ప్రజలు బాధపడుతున్నారు
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే
డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి
ఎర్రగుంట్ల : ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని.. ఇప్పుడు మోసపోయామని తెలుసుకుని బాధపడుతున్నారని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగుంట్ల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యక్తిగతంగా తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, తనను తిట్టడం తగదన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ప్రజల ఖాతాల్లో రూ. లక్ష పడి ఉండేదన్నారు. ఎన్నికల్లో పోట్లదుర్తి గ్రామంలో ఎంపీ సీఎం రమేష్ నాయుడు నిజాయితీగా పనిచేయడం వల్లే ఆదినారాయణరెడ్డికి అక్కడ మెజార్టీ వచ్చిందన్నారు. కానీ తన సొంత పార్టీ నేత పనులనే ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారన్నారు. అందుకే ఎంపీ సైతం జమ్మలమడుగులోని పేకాట క్లబ్‌లపై స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు. తమ హయాంలో ఒక్క ఫించన్ కూడా రద్దు చేయలేదని, ఇప్పుడు నియోజకవర్గంలో 2 వేలకు పైగా పింఛన్‌లు రద్దయ్యే పరిస్థితి ఉందన్నారు. వాటిని నిలబెట్టాలని కోరారు. ఎర్రగుంట్లలో డ్రైనేజీలో పూడికలు తీసేందుకు రూ.34 లక్షలు, నాలుగు రోడ్ల కూడలిలో రూ.10 లక్షలతో చేస్తున్న పనుల్లో అవినీతి కనిపిస్తోందన్నారు. ఇసుక మాఫియా, ఎర్రమట్టి, ఫ్‌లైయాష్ కోసం టీడీపీలోనే రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకుంటున్నారని విమర్శించారు. కొండాపురం ఆర్ అండ్ ఆర్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12 లక్షలు ఇప్పించాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజకీయం తెలియని వారు కూడా గెలిచారని.. ఆదినారాయణరెడ్డి గెలవడం గొప్ప విషయం కాదన్నారు. సూపర్ సిక్స్ పథకాలే ఈ విజయానికి కారణమన్నారు. వ్యక్తిగత దూషణలు మాని ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు తమ్మిశెట్టి బాలయ్య, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు జయరామక్రిష్ణారెడ్డి, కౌన్సిలర్ మహమ్మద్ అలీ, పార్టీ నాయకులు నారపురెడ్డి, రామలింగారెడ్డి, నాగరాజు, ఇస్మాయిల్, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment