రైతుల గోడు వినిపించుకోండి
● చంద్రబాబు, కరువు కవలపిల్లలు
● వ్యవసాయంపై సీఎం, మంత్రులు చిన్న సమీక్ష చేయకపోవడం దారుణం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో రైతుల గోడు కూటమి ప్రభుత్వం వినిపించుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువును వెంట తీసుకుని వస్తారని, కరువు, ఆయన కవలపిల్లలని ఎద్దేవా చేశారు.ఆయన పాలనలో సకాలంలో పంటలు పండవని, మద్దతు ధర లభించక రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడినందున బాబు రికార్డ్ బ్రేక్ చేశారన్నారు. మేనిఫెస్టోలో రైతులకు పెట్టుబడి నిధి కింద ఎకరాకు రూ.20వేలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఈ క్రాపింగ్ విధానం, ఆర్‌బీకేలను నిర్వీర్యం చేశారన్నారు. ఆర్‌బీకేల వ్యవస్థను ప్రపంచ దేశాలు, మిగతా రాష్ట్రాలు మెచ్చుకుంటుంటే ఈ రాష్ట్రంలో మాత్రం రేషనలైజేషన్ పేరుతో ఆర్‌బీకేలను, ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక లాభాలు కలిగేవన్నారు. టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే సైంటిస్టులు సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు. రైతులకు సున్నావడ్డీకే రుణాలు లభించేవన్నారు. గతంలో వీఎన్‌పల్లెలో ఉల్లి పంటకు నష్టం వస్తే 21 రోజుల్లోనే పంట నష్ట పరిహారం అందించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తుందని, మద్దతు ధర ప్రకటించని పసుపు, మిర్చి, అరటి వంటి 24 రకాల పంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ధర ప్రకటించారన్నారు. రైతుల పండించిన పంటలో ప్రభుత్వం 50 శాతం కొంటే, మిగిలిన పంటను వారు ఎలాగైనా అమ్ముకుంటారన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఉండేవని, భూసార పరీక్షలు, నీటి పరీక్షలు వంటివి అందులో చేసేవారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేస్తోందని విమర్శించారు. రోమ్ నగరం తలగబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు...రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయంపై చంద్రబాబుగానీ, మంత్రులుగానీ చిన్న సమీక్ష కూడా చేయలేదని ధ్వజమెత్తారు. మిర్చి పంటకు సంబంధించి 25 శాతం పంటను రూ.3528కోట్లు ఖర్చుచేసి కొంటే రైతులకు ఉప యోగమని అధికారులు లెక్కలు వేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళితే....అప్పుడు ఆదరా బాదరాగా కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారన్నారు. మిర్చిని గతంలో ఎప్పుడూ నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పరిస్థితి లేదన్నారు. అయినా చంద్రబాబు నాఫెడ్‌కు లెటర్ రాయడం విచిత్రంగా ఉందన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని వైఎస్ జగన్ చెబితే, మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో క్వింటాల్ మిర్చి ధర రూ.20వేలకు పైగా ఉండేదని, ఇప్పుడు రూ.6వేలు కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.30లక్షల కోట్లు అప్పులు చేశారని, కానీ ఆ నిధులను ఎక్కడ వినియోగించారో చెప్పలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు చేసినా దానిని సంక్షేమానికి వినియోగించారన్నారు. మిర్చి యార్డుకు వెళ్లినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు. అందులో పాల్గొనని వారిపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. తమకు కేసులు కొత్తకాదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాడేందుకు వైఎస్‌ఆర్సీపీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, నాగేంద్రా రెడ్డి, షఫీ, శ్రీరంజన్ రెడ్డి, హరిచందన్, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment