చరిత్ర విస్మరించిన యోధుడు ఉయ్యాలవాడ
కడప సెవెన్‌రోడ్స్ : నేటికి సరిగ్గా 178 సంవత్సరాల క్రితం నాటి కడప జిల్లా తాలూకా కేంద్రమైన కోవెలకుంట్లలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఉయ్యా లవాడ నరసింహారెడ్డిని ఉరి తీసింది. కడప కలెక్టర్ జేహెచ్ కాక్రేన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు వేల పైబడి జనం చూస్తుండగా బహిరంగంగా ఈ దారుణానికి పాల్పడ్డారు. తమను ఎదిరించే ఎవరికై నా ఇదే గతి పడుతుందని ప్రజలను హెచ్చరిస్తూ 30 ఏళ్లపాటు ఆయన తలను అలాగే ఉంచారు. మూడు నెలలపాటు తమను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటును ఎట్టకేలకు అణిచి వేశామని బ్రిటీషర్లు సంబరాలు చేసుకున్నారు. కానీ పదేళ్ల తర్వాత అది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా రూపుదాలుస్తుందని, సరిగ్గా వందేళ్లకు తాము ఈ దేశాన్నే వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుందని ఊహించలేకపోయారు.
చరిత్రకారుల చిన్నచూపు
నరసింహారెడ్డి తిరుగుబాటకు సంబంధించిన బ్రిటీషు రికార్డులు ఎన్నో ఉన్నాయి. జానపదుల కోలాటపు పాటలు, పిచ్చిగుంట్ల వారు ఆలపించే పాటలు, ఇతర జానపద సారస్వతం తక్కువేమి లేదు. కానీ, ఆంధ్ర చరిత్రకారులకు ఇవి పట్టినట్టు లేదు. ఈ తిరుగుబాటు పట్ల చులకన ధోరణి ప్రదర్శించారు. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, చీరాల–పేరాల ఉద్యమం వంటివి చరిత్ర పుస్తకాలకెక్కాయి. కానీ నరసింహారెడ్డి సాగించిన వీరోచిత తిరుగుబాటు చరిత్రపుటల్లో చోటు చేసుకోకపోవడం బాధాకరం. ఇది రాయలసీమపై జరుగుతున్న వివక్షలో భాగమేనని ఇక్కడి మేధావులు అంటున్నారు. ప్రముఖ బెంగాలీ చరిత్రకారుడు ఎస్‌బీ చౌదురి 1955లో రాసిన ‘సివిల్ డిస్ట్రబెన్సెస్ డ్యూరింగ్ ద బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా’ (1765–1857 అనే గ్రంథంలో నరసింహారెడ్డి తిరుగుబాటుకు ఒక సముచిత స్థానం కల్పించడం విశేషం. ఆ తర్వాత కాలాల్లో ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు పరిశోధన చేసి రూపొందించిన రేనాటి సూర్యచంద్రులు గ్రంథం, ప్రముఖ చరిత్రకారుడు బండి గోపాల్‌రెడ్డి రాసిన ‘బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు–కడప జాబుల సంకలనం’, కల్వటాల జయరామారావు రాసిన రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పాణ్యం నరసరామయ్య రాసిన స్వాతంత్య్ర వీరుడు అనే పద్యకావ్యం వంటివి లేకపోతే నరసింహారెడ్డి తిరుగుబాటుకు సంబంధించిన వివరాలు చరిత్ర కాలగర్బంలో కలిసిపోయి ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రాకపోయి ఉంటే రాయలసీమ జిల్లాల్లో కూడా నేటి తరానికి ఆయన పేరు తెలిసేది కాదు.
తొలి స్వాతంత్య్ర యోధుడు
ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కాదని కొందరు వితండవాదన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ సంస్థానాన్ని లాక్కున్న బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సమరం చేసిన ఝాన్సీలక్ష్మిభాయి స్వాతంత్య్ర సమరయోధురాలైనపుడు, సిపాయిల పితూరి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామమైనపుడు అంతకు పదేళ్ల ముందే గొప్ప తిరుగుబాటు చేసి ఉరికొయ్యను ముద్దాడిన ఉయ్యాలవాడ ఎందుకు స్వాతంత్య్ర సమరయోధుడు కాకుండా పోయారని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి తిరుగుబాటు వెనుక ఆర్థిక, రాజకీయ కారణాలు ఉంటాయి. భారతీయుల ఉమ్మడి శత్రువైన బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా దాన్ని స్వాతంత్రోద్యమ స్రవంతిలో విడదీయరాని భాగంగానే చూడాలి.
‘సీమ’ రైతాంగ తిరుగుబాటు
నరసింహారెడ్డి పెన్షన్ కోసం చేసిన తిరుగుబాటు అని కొందరు అర్థరహితమైన వాదనలు చేస్తున్నారు. ఆయన పెన్షన్ కోసమే అయితే తొమ్మిది వేల మంది ప్రజలు ప్రాణాలు తెగించి తిరుగుబాటులో ఎందుకు పాల్గొన్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. భూమి శిస్తు చెల్లించలేని రైతులు, ఇనాములు కోల్పొయిన కట్టుబడులు, ఇంకా అనేక కారణాల వల్ల దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఈ తిరుగుబాటులో పాల్గొన్నట్లు నాటి ప్రభుత్వం నియమించిన స్పెషల్ కమిషనర్ డబ్ల్యుఏడీ ఇంగ్లీస్ 1847 జనవరి 19న జ్యుడిషియల్ డిపార్టుమెంటు సెక్రటరీకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఇది రాయలసీమ రైతులు జరిపిన తొలి తిరుగుబాటుగా చూడాలి.
ప్రభుత్వాల వివక్ష
ఎంతోమంది మహానుభావుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నప్పటికీ నరసింహారెడ్డి జయంతి ఇంతవరకు నిర్వహించకపోవడం ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివక్షను ఎత్తిచూపుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉయ్యాలవాడ ప్రధాన అనుచరుల్లో ఒకరైన వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించడం ఆహ్వానించదగింది. అయితే ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉయ్యాలవాడను మాత్రం విస్మరించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉయ్యాలవాడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యాంశాల్లో ఆయన చరిత్రను చేర్చాలని, ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
నేడు 178వ వర్ధంతి సభ
నేడు వర్ధంతి సభ
రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు కడప ప్రెస్‌క్లబ్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు. కడప మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్ అధ్యక్షతన జరగనున్న ఈ సభలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, నంద్యాలకు చెందిన ప్రముఖ జర్నలిస్టు కాశీపురం ప్రభాకర్‌రెడ్డి, ఉయ్యాలవాడ వంశీయులైన రూపనగుడి గ్రామానికి చెందిన కర్ణాటి ప్రభాకర్‌రెడ్డి, ఇతర పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొననున్నారు.
చరిత్ర విస్మరించిన యోధుడు ఉయ్యాలవాడ
Comments
Please login to add a commentAdd a comment