దాల్మియా నిర్వాకంతో రైతులకు తీవ్ర నష్టం
జమ్మలమడుగు/మైలవరం : నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలంలో ఏర్పాటైన దాల్మియా సిమెంట్ కర్మాగారం నిర్వాకంతో పరిసర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన దాల్మియా సిమెంట్ కర్మాగారం కారణంగా నష్టపోతున్న నవాబుపేట, చిన్న కొమెర్ల, దుగ్గన పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములిచ్చి సహకరించిన రైతుల పట్ల దాల్మియా యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దాల్మియా యాజమాన్యం వంకలు,వాగులు ఆక్రమించి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వల్ల వర్షాకాలంలో వరదలు వచ్చిన ప్రతి సారి పంట పొలాలు నీట మునుగుతున్నాయని అన్నారు. దీనిపై నవాబుపేట, దుగ్గనపల్లి ఎస్సీకాలనీ ప్రజలతోపాటు చిన కొమెర్ల గ్రామానికి సంబంధించిన రైతులు అనేక సార్లు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిగా వంకలను పూర్తిగా ఆక్రమించి కట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని యాజమాన్యానికి వివరించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో మూడు గ్రామాలకు చెందిన రైతులు లోకాయుక్తను ఆశ్రయించారన్నారు. గతంలో అధికారులు దాల్మియా యాజమాన్యం ప్రలోభాలకు లొంగి తప్పుడు రిపోర్టు ఇచ్చారన్నారు. ఇటీవల లోకాయుక్త కమిటీ ఈ ప్రాంతాన్ని పర్యటించి నివేదిక ఇచ్చింది. పంటపొలాలతో పాటు బ్లాస్టింగ్ వద్ద దెబ్బతిన్న నవాబు పేట గ్రామ ప్రజల ఇండ్లకు పరిష్కారం, దుగ్గనపల్లి గ్రామంలోని రైతుల పంట పొలాలకు పరిహారం ఇవ్వడంతోపాటు వారి గ్రామాన్ని వేరే చోటుకు తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని లోకాయుక్త యాజమాన్యానికి సూచించింది. అయితే యాజమాన్యం ఇవేమి పట్టించుకోకుండా ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు పోవడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వ్యతిరేకం కాదు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ధుమ్ము, ధూళి వల్ల కేవలం 200 మీటర్లదూరంలో ఉన్న దుగ్గన పల్లి గ్రామస్తులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారన్నారు. వాటికి పరిష్కారం చూపకుండా రెండో ప్లాంట్ విస్తరణకు వెళితే రైతుల కోపాన్ని యాజమాన్యం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
దాల్మియా విస్తరణకు సహకరించం :
తమ సమస్యలకు పరిష్కారం చూపని దాల్మియా విస్తరణ కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని మూడు గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. ఈనెల 27వతేదిన జరిగే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే రెండో ప్లాంట్ నిర్మాణానికి ఎటువంటి పరిస్థితుల్లో తాము సహకరింబోమని మైలవరం మండలం నవాబుపేట, దుగ్గనపల్లి, కొమెర్ల గ్రామాలకు చెందిన రైతులు తెగేసి చెబుతున్నారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శివ గుర్విరెడ్డి,నవాబుపేట భాస్కర్‌రెడ్డి ,మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డితదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment