సాయం చేయబోయి మృత్యు ఒడిలోకి
ఖాజీపేట : రోడ్డుకు అడ్డుగా ఉన్న కారును తొలగించి అందులోని వారికి సాయం చేయబోయి నరహరి నాయుడు (36) మృత్యువాత పడ్డాడు. వివరాలిలా.. దువ్వూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన లగుడపాటి నరహరి నాయుడు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌లో తాత్కలికంగా ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఆటో నడుపుతుండే వాడు. ఆటోలో రాజంపేటకు బాడుగకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఖాజీపేట మండలం కుమ్మరకొట్టాలు జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఇన్నోవా వాహనం టైర్ పగిలి రోడ్డుకు అడ్డుగా పడింది. అందులో ఉన్న వ్యక్తులు అటుగా వస్తున్న ఆటోలోని నరహరి నాయుడు సహాయం కోరారు. వారి విజ్ఙప్తి మేరకు కారును రోడ్డుకు అడ్డుగా లేకుండా తొలగించే ప్రయత్నం చేస్తుంగా వేగంగా లారీ వచ్చి ఢీకొంది. దీంతో అక్కడికక్కడే నరహరి నాయుడు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఖాజీపేట సీఐ మోహన్ తెలిపారు.
పోస్టుమాస్టర్ అరెస్టు
కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురంలోని బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపాల్‌నాయక్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. వివరాలిలా.. పోస్టుమాస్టర్ గత 14 సంవత్సరాలుగా నరసాపురంలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ పోస్టుఫీసు పరిధిలో 7 గ్రామాల ప్రజలతో పరిచయాలు బాగా పెంచుకుని పోస్టుఫీసులో ఖాతాదారులుగా చేర్చారు. ఖాతాదారులు తమ డబ్బును పోస్టాఫీసులో జమ చేసుకుంటూ వస్తున్నారు. అయితే పోస్టుమాస్టర్ ఖాతాదారుల నగదును పోస్టాఫీసులో జమ చేయకుండా సొంత ఖర్చులకు వాడుకుంటూ ఉండేవాడు. నరసాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి 2024 సెప్టెంబర్‌లో తన ఖాతాలోని డబ్బులు వాడుకున్నారని పోలీసుస్టేషన్‌లో పోస్టుమాస్టర్‌పై ఫిర్యాదు చేసింది. సుకన్య సమృద్ధి యోజక కింద రూ.2.90 లక్షల నగదు ఆమెకు రావాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతో ఆ నగదును వాడుకున్నాడు. అప్పటి నుంచి పోస్టాఫీసుకు రావడం లేదు. దీనిపై జిల్లా పోస్టల్ అధికారులు విచారణ చేపట్టారు. తిరుపాల్‌నాయక్ సుమారుగా రూ.22.67 లక్షలు ఖాతాదారుల నగదును వాడుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తుండగా శుక్రవారం ఓబుళాపురం వద్ద తిరుపాల్‌నాయక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులకు
న్యాయం జరిగేలా చూడాలి
బద్వేలు అర్బన్ : అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మోసాలకు బలైన కస్టమర్లకు, ఏజెంట్లకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ సుధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బాబురావు, వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ సమర్థ అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణను అప్పగించడంతో పాటు అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జాన్, బాబు, పార్థసారధి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సాయం చేయబోయి మృత్యు ఒడిలోకి
Comments
Please login to add a commentAdd a comment