ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
కడప అర్బన్ : కడప నగరంలోని సెవెన్‌రోడ్స్ సర్కిల్ వద్ద గురువారం రాత్రి ఓ వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ జావేద్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వృద్ధుడి మృతదేహం వద్ద లభించిన ఆధారాల మేరకు వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు మండలం వనిపెంటకు చెందిన షేక్ బాషా మోహిద్ (75) అనే వృద్ధుడు కడపకు పనిమీద వచ్చాడు. ఏడు రోడ్ల కూడలి వద్ద ఆ వృద్ధుడు రోడ్డు దాటుతున్న సమయంలో పాతబస్టాండ్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొంది. వృద్ధుడి తలపై బస్సు ఎక్కడంతో తలంతా నుజ్జునుజ్జయింది. పోస్టుమార్టం కోసం వృద్ధుడి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
వాలీశ్వరకొండపై కర్ణాటక భక్తురాలి మృతి
రామసముద్రం : మండలంలోని బల్లసముద్రం కొండపై వాలీశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తురాలు మార్గమధ్యంలో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు... కర్ణాటక గుండ్లపురానికి చెందిన భక్తురాలు వెంకటమ్మ(75) గురువారం కాలినడకన కొండపైకి ఎక్కుతోంది. అయితే మార్గమధ్యంలో ఉన్నట్లుండి కుప్పకూలి పడిపోయి అక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించారు. కర్ణాటకలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కర్నాటక భక్తురాలు ఎండవేడికి తట్టుకోలేక మరణించిందా..? లేక గుండెపోటుతో మృతి చెందిందా అన్నది తెలియలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment