సర్వేత్రా ఆందోళన !
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం రోజుకో సర్వేతో ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలనుంచి పూటకో వివరాలను రాబట్టమని సచివాలయ సిబ్బందితో ఆడుకుంటోంది.
గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్, 2000 ఇళ్లకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేవారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను తొలగించారు. గత ప్రభుత్వంలో నెలలో కనీసం రెండు, మూడు సంక్షేమ పథకాలైన అమలవుతూ వాటిని చేరవేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 మాసాల్లో పింఛన్లు మినహా మరే సంక్షేమ పథకమూ అమలు చేయలేదు. దీంతో ప్రభుత్వం వారిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నానా రకాల సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్లు మినహా మిగిలిన సెక్రటరీలందరితో ఈ సర్వేలు చేయిస్తున్నారు. పీ–4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, ఎంఎస్‌ఎంఈ సర్వే, చిల్డ్రన్ బర్త్ సర్వే, నాన్ రెసిడెంట్స్ సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. పీ–4 సర్వేలో ఎంపిక చేసిన వారి ఇంటికి వెళ్లి వారికి కారు, ఏసీ వంటివి ఉన్నాయా..., ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా... వంటి వివరాలు అడుగుతున్నారు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని సచివాలయ సెక్రటరీకి చెప్పాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రం హోం సర్వేలో ఎవరి ఇంట్లోనైనా ఐటీ సిబ్బంది, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా...వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంఎస్‌ఎంఈ సర్వేలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, వాటి యజమానులు ఎవరు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, రుణం ఏమైనా అవసరమా వంటి వివరాలు అడుగుతున్నారు. చిల్డ్రన్ బర్త్ సర్వేలో పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారా, ఆధార్ కార్డు చేయించారా, ఎందుకు చేయించలేదని వివరాలు కనుక్కుంటున్నారు. ఇక నాన్ రెసిడెంట్స్ సర్వేలో ఎవరి ఇంట్లోనైనా సభ్యులు విదేశాలకు వెళ్లారా...ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారా వంటి వివరాలు రాబడుతున్నారు.
పింఛన్లు కొందరికే..
గత ప్రభుత్వంలో భార్య లేదా భర్త పింఛన్ పొందుతూ చనిపోతే బతికున్న భార్య లేదా భర్తకు ఆ పింఛన్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్చిలో చనిపోయిన వారి భర్త లేదా భార్యలకే పింఛన్లు ఇస్తున్నారే తప్పా ఇదివరకు 9 మాసాలలో చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్ వర్తింపజేయడం లేదు. దీంతో చాలామంది పింఛన్లు పొందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్న పింఛన్లే తొలగిస్తున్న తరుణంలో ఇక కొత్త పింఛన్లు ఇవ్వడం ఉత్తమాటేనని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల వెనక మతలబు ఇదేనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
సచివాలయ సిబ్బందికి ఎన్ని తిప్పలో!
ఈ అన్ని సర్వేల్లో కేవలం ఇంటిపేరు, పేరు మాత్రమే చెప్పి సర్వే చేయమనడం వల్ల వారు ఎక్కడ నివసిస్తున్నారో, వారి డోర్ నంబర్ ఏమిటో తెలియక సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఎవరెవరు ఎంతమందిని సర్వే చేశారని ఉన్నతాధికారులు ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్‌లో ఒత్తిడి తెస్తున్నారు. ఇంటిపేరు, పేరు ఆధారంగా వారిని ఎలాగోలా కనుక్కున్నప్పటికీ చాలామంది సర్వేలకు సహకరించడం లేదని, ఓటీపీలు చెప్పడం లేదని తెలుస్తోంది. అత్యధిక మంది ఇంటిలోపలికే సచివాలయ సిబ్బందిని అనుమతించడం లేదని సమాచారం. దీంతో కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం... అన్నచందంగా సచివాలయ సెక్రటరీల పరిస్థితి తయారైంది. రెండు, మూడు నెలల కిందటే వికలాంగుల పింఛన్లపై వెరిఫికేషన్ పూర్తయ్యింది. ఇప్పుడు ఏకంగా 5 సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. త్వరలో స్వర్ణాంధ్ర సర్వే కూడా చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఇంకా ఎన్ని సర్వేలు చేయాలోనని సచివాలయ సెక్రటరీలు లోలోపలే మథనపడుతున్నారు.
రోజుకో సర్వే చేస్తున్న కూటమి ప్రభుత్వం
అన్నింటికీ సచివాలయ సెక్రటరీలే ఆధారం
సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికేనని ప్రజల్లో అనుమానాలు !
Comments
Please login to add a commentAdd a comment