● అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం
● 9వ తరగతి విద్యార్థులకు అవకాశం
● మార్చి 23 వరకు ఆన్‌లైన్‌లో
నమోదుకు గడువు
షెడ్యూల్ ఇలా..
రిజిస్ట్రేషన్ గడువు : మార్చి 23 వరకు
ఎంపికై న విద్యార్థుల
జాబితా విడుదల : ఏప్రిల్ 7
విద్యార్థులకు ఆహ్వానం : మే 18
యువికా కార్యక్రమం : మే 19వ తేదీ నుంచి
30 వరకు
యువికా ముగింపు : మే 31వ తేదీ
కడప ఎడ్యుకేషన్ : బాల్య దశలోనే విద్యార్థులను సైన్సు, అంతరిక్ష సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది, అంతరిక్ష వీక్షణం, ఉపగ్రహాల ప్రయోగాలు వంటి వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ భావితరాల వారిని అంతరిక్ష శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) కింద 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు మార్చి 23 లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు గడువును ప్రకటించింది.
ఎంపిక ఇలా..
8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 15 శాతం, ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే క్విజ్‌లో 10 శాతం, సైన్సుఫెయిర్‌లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలంపియాడ్ ఎగ్జామ్స్‌లో పాల్గొన్న వారికి 10 శాతం, ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరుగైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
చక్కటి అవకాశం..
అంతరిక్ష రంగంపై ఆసక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. జాతీయ స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు మే 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరిస్తారు. ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్సు, కంప్యూటర్ సైన్సులపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఇస్రో చైర్మన్‌తో సంభాషించే అవకాశం కలుగుతుంది.
లక్ష్యం ఇదీ..
అంతరిక్ష పరిజ్ఞానంలో మన దేశం పలు విజయాలతో అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపి వారిని ఆ స్థాయిలో తీర్చిదిద్దేందుకు యూవికా ఏర్పాటు చేశారు. ఇలా భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలనుకుంటున్నారు. ప్రతిభావంతుల కోసం ఇస్రో ప్రకటన జారీ చేసింది
దరఖాస్తు ఇలా..
ఇస్రో ప్రధాన వెబ్‌ౖసైట్‌లో మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌టీటీపీఎస్://డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఎస్‌ఆర్‌ఓ.జీఓవీ.ఇన్/యువిక.హెచ్‌టీఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితాను ఏప్రిల్ 9న విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులకు ఆహ్వానం అందజేస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2025 నిర్వహిస్తారు. మే 31తో కార్యక్రమం ముగుస్తుంది.