గడ్డివాములు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డివాములు దగ్ధం

Mar 19 2025 1:20 AM | Updated on Mar 19 2025 1:19 AM

– స్పందించని అగ్నిమాపక సిబ్బంది

సింహాద్రిపురం : ఆకతాయిలు చేసిన పనికి రైతులు వేసుకున్న గడ్డివాములతో పాటు ట్రాక్టర్‌ ట్రాలీ, పల్టర్‌ దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిదినంచర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇళ్ల సమీపాన ఎవరో ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఊరి సమీపాన ఉన్న మొలకల జయరామిరెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, నాగేశ్వర్‌ రెడ్డి, మునిరెడ్డిలకు చెందిన నాలుగు గడ్డి వాములతోపాటు ఒక ట్రాక్టర్‌ ట్రాలీ, పల్టర్‌ దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.2లక్షలకుపైబడి నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఫోన్లు చేస్తున్నా అగ్నిమాపక శాఖ సిబ్బంది స్పందించలేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు.

రెండు లారీలు ఢీ

– డ్రైవర్‌ దుర్మరణం

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులో మై హోం కాలనీ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో హెచ్‌పీ గ్యాస్‌ లారీ డ్రైవర్‌ గండ్లూరు కదిరయ్య (41) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి 1.30 గంటలకు జరిగింది. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన గండ్లూరు కదిరయ్య హెచ్‌పీ గ్యాస్‌ లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఎర్రగుంట్ల నుంచి కడప రోడ్డు మార్గాన వెళుతుండగా మైహోం కాలనీ వద్ద ముందు వెళుతున్న మరో లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో హెచ్‌పీ గ్యాస్‌ లారీ ముందు భాగం నుజ్జు నుజ్జయింది. లారీ డ్రైవర్‌ కదిరయ్య క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కున డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. కదిరయ్యకు కాలు తెగిపోవడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ గురుశంకర్‌రెడ్డి తెలిపారు.

రాయచోటి కేసులో

12 మందికి బెయిల్‌

కడప అర్బన్‌ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మార్చి 9వ తేదీ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న 12 మంది మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు.

నీటి సంపులో పడి

బాలుడి మృతి

మదనపల్లె : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రాజశేఖర్‌రెడ్డి, గీత దంపతులకు సాత్విక్‌రెడ్డి, చార్విక్‌రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం కాలనీలో నీటిసరఫరా జరుగుతున్న సమయంలో నీళ్లను పట్టుకునేందుకు తల్లి, నానమ్మ హడావిడిలో ఉండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చార్విక్‌రెడ్డి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

35 గ్రాముల

బంగారు గొలుసు చోరీ

సుండుపల్లె : మండల పరిధిలోని పింఛాలో అమ్మణ్ణెమ్మ తన మనవడిని చూసేందుకు ఈ నెల 8వ తేదీన బెంగళూరుకు వెళ్లింది. సోమవారం తిరిగి తన స్వగ్రామానికి చేరుకుంది. ఇంటిలోకి వెళ్లగా బీరువా తాళాలు పగలగొట్టి 35 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేసినట్లు గుర్తించింది.

గడ్డివాములు దగ్ధం 1
1/3

గడ్డివాములు దగ్ధం

గడ్డివాములు దగ్ధం 2
2/3

గడ్డివాములు దగ్ధం

గడ్డివాములు దగ్ధం 3
3/3

గడ్డివాములు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement