
చెడు వ్యసనాలకు బానిసలై.. ఏటీఎంలో చోరీకి యత్నం
ఇద్దరు నిందితుల అరెస్టు
ఎర్రగుంట్ల : చెడు వ్యసానాలకు బానిసలై డబ్బుల కోసం ఏకంగా ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ నరేష్‌బాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన కొత్తమాసి సుధీకర్, గాలిపోతుల అభిషేకం స్నేహితులు. వీరిలో కొత్తమాసి సుధీకర్ 2020 సంవత్సరం నుంచి సెక్యూర్ వ్యాలీవ్ కంపెనీ ద్వారా ఏటీఎంలకు డబ్బులను లోడ్ చేసేవాడు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలో ఏటీఎంలకు డబ్బులు లోడ్ చేసే క్రమంలో అప్పుడుప్పుడు డబ్బులను దొంగిలిస్తూ సుమారు రూ.36 లక్షలు తన చెడు వ్యసనాలకు వాడుకున్నాడు. సెక్యూర్ వ్యాలీవ్ కంపెనీవారు డబ్బులు కాజేసిన విషయాన్ని తెలిసుకుని కొత్తమాసి సుధీకర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. వాడుకున్న డబ్బును ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి వద్ద నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత సుధీకర్ జల్సాలకు డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఎర్రగుంట్ల పట్టణం వేంపల్లి రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మూసి ఉన్న విషయం తెలుసుకున్నాడు. గతంలో ఈ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసి ఉండటంతో సులువుగా డబ్బులు దొంగిలించవచ్చనుకున్నాడు. ఈ తరుణంలోనే ప్రొద్దుటూరులోని ఆటో నగర్‌లో వెల్డర్‌గా పనిచేస్తున్న గాలిపోతుల అభిషేకంను తోడు చేసుకుని గ్యాస్ , ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం ఏటీఎంలోకి వచ్చి షటర్ మూసి ఏటీఎం బాక్సును కట్ చేసి డబ్బులు సులువుగా దొంగిలించవచ్చనుకున్నారు. అయితే ఏటీఎం క్యాష్ బాక్స్ మెయిన్ డోర్ ఎంత సేపటికి తెరుచుకోలేదు. దీంతో ఎవరైనా వస్తారేమో అనే భయంతో అక్కడి నుంచి కారులో వస్తువులన్నీ వేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.