కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా నర్సరీలలోనూ, రైతుల పొలాలలోనూ అటవీజాతి మొక్కలను పెంచి సంపదను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్‌కుమార్ అన్నారు. కడపలోని డీఎఫ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం (మార్చి21)ను నేషనల్ ఫారెస్ట్ డే సందర్భంగా వినీత్ కుమార్ మాట్లాడారు. మొక్కలను నాటడమే కాదు, వాటిని నాటిన తర్వాత ఎదుగుదల గమనించడం ముఖ్యమన్నారు. అడవులను కాపాడడానికి అందరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని నగరవనాలు, ఎకో పార్కుల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఆయన వివరించారు. కడప నగరవనాన్ని రూ. 2 కోట్ల వ్యయంతో.. ప్రొద్దుటూరులో ఎకోపార్క్‌ను రూ. 84 లక్షలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గండికోట– మైలవరం మధ్యలో వున్న పొన్నతోటలో నగరవనం ఏర్పాటు చేయనున్నామన్నారు. బద్వేల్ పరిధిలో సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపంలో మరో నగరవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు ‘కడప నేటివ్ ఫారెస్ట్ రెస్టోరేషన్ ప్రాజెక్ట్’పోస్టర్‘ ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్‌ఓ దివాకర్, బద్వేల్ సబ్ డీఎఫ్‌ఓ స్వామి వివేకానంద, కడప ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాద్, పోరుమామిళ్ల ఎఫ్‌ఆర్‌ఓ రఘునాథ రెడ్డి , ప్రొద్దుటూరు ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలి ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు.
ఆదేశాలు రాలేదు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాశినాయన క్షేత్రం పునరుద్ధరణ ఆదేశాలు ఇంకా రాలేదని ఓ ప్రశ్నకు డీఎఫ్‌ఓ సమాధానమిచ్చారు. కాశినాయన క్షేత్రం పరిధిలో రిజర్వ్‌ఫారెస్ట్‌కు సంబంధించి నిబంధనలను అమలుచేసేందుకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్, కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకే జిల్లా అటవీశాఖ తరఫున చర్యలను మొదలుపెట్టామన్నారు. బస్సులను నిలిపివేయడం, పలుమార్లు కాశినాయన క్షేత్ర ప్రతినిధులు, సిబ్బందితో సంప్రదించామన్నారు. ఇటీవల భవనాల కూల్చివేత తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పునరుద్ధరణకు సంబంధించిన లిఖిత పూర్వకమైన ఆదేశాలు తమ శాఖకు అందలేదని వివరించారు.
జిల్లాలో నగరవనం, ఎకో పార్క్‌ల అభివృద్ధికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాశినాయన క్షేత్రం పునరుద్ధరణ ఆదేశాలు ఇంకా రాలేదు
విలేకరుల సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి వినీత్‌కుమార్