కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపజిల్లాగా మార్పు చేస్తూ జీఓ ఎంఎస్ నెంబరు 99 విడుదల చేశారు. ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) యాక్ట్–1974 ఆర్/డబ్ల్యు రూల్–4 ఆఫ్ ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) రూల్స్–1984 మేరకు ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా ద్వారా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాయి. ఈ మేరకు కలెక్టర్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జిల్లా గెజిట్‌లో ప్రచురించి ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానించాలని ఆదేశించారు. 30 రోజుల్లో అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి పంపాలని సూచించారు.
వైఎస్‌ఆర్ సేవలకు గుర్తింపుగా...
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేశారు. కడప రిమ్స్, డెంటల్ కళాశాల, యోగి వేమన విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ స్కూలు, ఐటీ కార్ల్, ట్రిపుల్ ఐటీ తదితర ఎన్నో విద్య,వైద్యాలయాలు స్థాపించారు. 2009 సెప్టెంబరు 2వ తేదిన ఆయన ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన సేవలకు గుర్తింపుగా నాటి ప్రభుత్వం 2009 అక్టోబరు 5వ తేదిన కడపజిల్లా పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాగా మార్పుచేస్తూ జీఓ విడుదల చేసి అభిప్రాయాలు, అభ్యంతరాలను కోరింది. ఆ తర్వాత 2010 జులై 7వ తేది వైఎస్సార్ జిల్లాగా మార్పు చేస్తూ జీఓ ఎంఎస్ నెం. 613 జారీ చేసింది. అప్పటి నుంచి వైఎస్సార్‌జిల్లాగా పిలుస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పేరును తొలగించి వైఎస్సార్‌కడపజిల్లాగా మార్పు చేస్తూ జీఓ జారీ చేసింది.