మైదుకూరు : స్థానిక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చినట్టు దేవదాయశాఖ మైదుకూరు ఈఓ ఎంఎస్ ప్రసాదరావు సోమవారం తెలిపారు. స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులో గత బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో పలు సర్వే నంబర్లలోని ఆలయ భూములను సర్వే చేసిన విషయం తెలిసిందే. దేవాలయం పేరుతో ఉన్న సర్వే నంబర్లు 1052/ఏ, 1052/బీ, 1052/సీలోని 4.46 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించినట్టు ఈఓ ప్రసాద్‌రావు తెలిపారు. ఈ భూములను 17 మంది ఆక్రమించినట్టు గుర్తించామని పేర్కొన్నారు. వారిలో సోమవారం సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆదేశాలతో ప్రొద్దుటూరు ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 15 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మిగిలిన ఇద్దరూ అందుబాటులో లేనందున వారికి మంగళవారం అందజేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉందని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.